ఘనపురం.. దయనీయం

17 Jun, 2019 13:00 IST|Sakshi

రోహిణిలో తుకం పోసి .. ఆరుద్రలో నాటేసే రైతన్నను అప్పట్లో మోతుబరి రైతు అనేవారు. ప్రస్తుతం ఆరుద్ర వచ్చినా తుకం పోసే పరిస్థితి లేదు. కార్తెలు కదులుతున్నా.. చినుకు కనిపించడం లేదు. వానాకాలం వచ్చినా ఎండల తీవ్రత తగ్గడం లేదు. మంజీర జీర బోయింది. నమ్ముకున్న ఘనపురం ఎడారిలా మారింది. ఇటీవల కురిసిన తేలిక పాటి వర్షాలతో దుక్కులు దున్నిన రైతన్నలు దిక్కులు చూస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో రుతుపవనాలొచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వరుణుడు కరుణిస్తే గాని ఘనపురం ప్రాజెక్టుకు గ్రహణం వీడే పరిస్థితి కనిపించడం లేదు. అటు వర్షాలు కురవక.. ఇటు ప్రాజెక్టులో చుక్కనీరు లేక ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

సాక్షి, మెదక్‌: మెతుకు సీమ రైతన్నల జీవనాధారం ఘనపురం ప్రాజెక్టు. 1905లో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిల్వ నీటి సామర్థ్యం 0.2 టీఎంసీలు. ఆనకట్టకు మహబూబ్‌నహర్‌ (ఎంఎన్‌), ఫతేనహర్‌ కెనాల్‌ (ఎఫ్‌ఎన్‌) ఉన్నాయి. ఎంఎన్‌ కెనాల్‌ పొడవు 42.80 కి.మీ. దీనిద్వారా కొల్చారం, మెదక్, మెదక్‌ రూరల్, హవేలి ఘనపూర్‌ మండలాల్లోని 18 గ్రామాల కింద 11,425 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ఎఫ్‌ఎన్‌ కెనాల్‌ పొడవు 12.80 కి.మీ. దీని ద్వారా పాపన్నపేట మండలంలోని 11 గ్రామాల పరిధిలోని 10, 200 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. మొత్తం సాగు భూమి 21,625 ఎకరాలు. ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు నిండితే గాని దిగువన ఉన్న ఘనపురం ప్రాజక్టుకు జలకళ రాదు. మంజీర వరదలు వస్తేనే ఘనపురం గలగలలు కనిపిస్తాయి.

ఎడారిలా మారిన సింగూరు.. ఘనపురం
వేసవిలో మండిన ఎండలతో సింగూరు బీటలు వారింది. 29 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 0.6 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.ç 0.2 టీఎంసీల సామర్థ్యం గల ఘనపురం ప్రాజెక్టు చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. గత రబీలో కొంతమంది  మంజీర నదిలో రింగు బోర్లు వేసి, రేయింబవళ్లు కష్టపడి పంట దక్కించుకున్నారు. మరి కొన్ని పంటలు నిలువునా ఎండిపోయాయి. ఘనపురం ప్రాజెక్టు కింద సుమారు నాలుగు వేల ఎకరాల పంట ఎండిపోయింది.

కార్తెలు కదిలి పోతున్నా కానరాని చినుకు
ఖరీఫ్‌ సీజన ఆరంభమై .. కార్తెలు కదిలి పోతున్నా చినుకు జాడ కానరావడం లేదు. రోహిణిలో తుకా లు పోస్తే మంచి దిగుబడులు వస్తాయంటారు. కాని ఆరుద్ర సగం పాదం ముగిసినా వరుణుడు కరుణించడం లేదు. ఎండలు ఇంకా మండిపోతూనే ఉన్నాయి.  ఇటీవల మృగసిర రోజున కురి సిన కొద్దిపాటి వర్షాలకు తోడు బోర్లు ఉన్న రైతు లు దుక్కులు సిద్ధం చేసుకుంటుండగా, 80 శాతం మంది దుక్కుల కోసం దిక్కులు చూస్తున్నారు.

బీ ముంచింది.. ఖరీఫ్‌ పైనే ఆశలు
గత రబీలో మంజీరను నమ్ముకొని పంటలు వేస్తే ఉన్న ఎకరంన్నర పంట ఎండి పోయింది. తిండి గింజలే దొరకని పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌లో పంట వేద్దామంటే ఇప్పటి వరకు దుక్కులు దిక్కులేవు. చినుకు రాలడం లేదు. ఎలా గడుస్తుందోనని ఆందోళనగా ఉంది. –సాలె కుమార్, రైతు, కొడుపాక

>
మరిన్ని వార్తలు