శివార్లకు జలసిరులు..

30 Mar, 2017 02:46 IST|Sakshi
శివార్లకు జలసిరులు..

జలమే జీవం.. తీరనున్న దాహం..
90 రోజుల్లో రికార్డు స్థాయిలో 1100 కి.మీ మార్గంలో పైప్‌లైన్లు
వందలాది కాలనీలకు తీరనున్న దాహార్తి..
శరవేగంగా 56 భారీ స్టోరేజ్‌ రిజర్వాయర్ల నిర్మాణం..


సాక్షి, హైదరాబాద్‌: దశాబ్దాలుగా తాగునీరులేక అల్లాడిన గ్రేటర్‌ శివార్లలో జలసిరులతో దాహార్తి సమూలంగా తీరనుంది. హడ్కో నిధులతో జలమండలి చేపట్టిన తాగునీటి పథకం పనులు రికార్డు స్థాయిలో విజయవంతమవడంతో ఆయా ప్రాంతాలకు మహర్దశ పట్టనుంది.  పలు మున్సిపల్‌సర్కిళ్ల పరిధిలో కేవలం 90 రోజుల వ్యవధిలో 1100 కిలోమీటర్లకు పైగా పైపులైన్లు ఏర్పాటుచేయడం విశేషం. దీనికి అదనంగా ఈ ఏడాది జూన్‌లోగా మరో 900 కి.మీ మార్గంలో పైపులైన్లు...56 భారీ స్టోరేజి రిజర్వాయర్లను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తుండడంతో లక్షలాదిమంది దాహార్తి తీరనుంది. గతంలో పదిరోజులుగా నల్లా నీరు రాక ..గొంతెండిన శివారువాసులకు ఇక నుంచి రోజూ నీళ్లిచ్చేందుకు జలమండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

రుతుపవనాలు కరుణిస్తే జూలై మాసం నుంచి ఆయా ప్రాంతాలకు రోజూ నీళ్లివ్వనున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నాయి. గ్రేటర్‌తోపాటు ఔటర్‌రింగ్‌రోడ్డుకు లోపలున్న 190 గ్రామాలు,నగరపంచాయతీల దాహార్తిని సైతం సమూలంగా తీర్చేందుకు బృహత్తర ప్రణాళికను త్వరలో అమలుచేయనున్నట్లు వెల్లడించాయి. సుమారు రూ.628 కోట్ల అంచనా వ్యయంతో ఆయా గ్రామాల పరిధిలో 1685 కి.మీ మార్గంలో పైపులైన్లు...398 ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నిర్మించనుండడం విశేషం.

వందేళ్ల తాగునీటి అవసరాలకు భారీ రిజర్వాయర్‌...
మరో వందేళ్లవరకు మహానగరానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు శామీర్‌పేట్‌ మండలం కేశవాపూర్‌లో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన భారీ స్టోరేజి రిజర్వాయర్‌ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. జలమండలి ఆధ్వర్యంలో సుమారు రూ.7770 కోట్ల అంచనా వ్యయంతో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వసామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్‌కు అవసరమైన అటవీ ,ప్రైవేటు భూములను ఆరునెలల్లోగా సేకరించే అంశంపై రెవెన్యూ,జలమండలి యంత్రాంగం దృష్టిసారించింది.

 ఈ రిజర్వాయర్‌కు ప్రధానంగా కొండపోచమ్మ సాగర్‌ నుంచి గోదావరి జలాలను తరలించి నింపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించి సాంకేతిక అంశాలు, డిజైన్లు, డ్రాయింగ్స్, పైప్‌లైన్స్, నీటిశుద్ధికేంద్రాలు, శుద్ధిచేసిన నీటిని ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌కు తరలించే పైప్‌లైన్ల ఏర్పాటు.. తదితర అంశాలను వ్యాప్కోస్‌ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.

ఔటర్‌ లోపలి గ్రామాల దాహార్తి తీరనుందిలా..
ఔటర్‌రింగ్‌ రోడ్డులోపలున్న 190 పంచాయతీలు, నగరపాలక సంస్థల పరిధిలో త్వరలో రూ.628 కోట్ల అంచనా వ్యయంతో తాగునీటి పథకం పనులు చేపట్టనున్నారు. ఆయా గ్రామాల్లో  398 ఓవర్‌ హెడ్‌ట్యాంకులను 34,700 కిలోలీటర్ల(3.47 కోట్ల లీటర్లు) నీటి నిల్వ సామర్థ్యం తో నిర్మించనున్నారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నుంచి 1685 కిలోమీటర్ల మేర నీటి సరఫరా పైపులైన్లు ఏర్పాటు చేసి ఆయా పంచాయతీల పరిధిలోని వేలాది కాలనీలు, బస్తీలకు నీటిసరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే శివారు ప్రాంతాల్లో సుమారు 25 లక్షలమంది దాహార్తి తీరే అవకాశం ఉంది.  కాగా ఇటీవల ఔటర్‌కు లోపలున్న గ్రామాలకు నీటిసరఫరా బాధ్యతలను ప్రభుత్వం గ్రామీణ నీటిసరఫరా విభాగం నుంచి బదలాయించి జలమండలి అప్పజెప్పిన విషయం విదితమే.

దాహార్తి తీర్చడం, సమస్యల పరిష్కారమే ధ్యేయం
గ్రేటర్‌తోపాటు ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న గ్రామపంచాయతీల దాహార్తిని సమూలంగా తీర్చేందుకు ప్రభుత్వం పలు బృహత్తర మంచినీటి పథకాలను అమలుచేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నాం.

 భారీ స్టోరేజి రిజర్వాయర్లను నిర్మిస్తున్నాం. వినియోగదారుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం జలమండలి అమలు చేస్తున్న సాంకేతిక ప్రయోగం, సామాజిక మాధ్యమాల వినియోగం సత్ఫలితాన్నిస్తోంది. అరకొర నీటిసరఫరా...ఉప్పొంగుతున్న మురుగు సమస్యలు...కలుషిత జలాలు.. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు గత ఐదు నెలలుగా సామాజిక మాధ్యమాలు, సాంకేతిక విధానాల ద్వారా స్వీకరిస్తున్న ఫిర్యాదులను గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తుండడం విశేషం.

గ్రేటర్‌ సిటిజన్లు అమితంగా ఇష్టపడే ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తుండడంతో వినియోగదారులకు ఊరటనిస్తోంది. ఆయా మాధ్యమాల ద్వారా అందుతున్న ఫిర్యాదులు..వాటిని జలమండలి పరిష్కరించిన తీరు ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
– ఎం.దానకిశోర్,
జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌

>
మరిన్ని వార్తలు