తక్కువ నీరు.. ఎక్కువ సేద్యం

15 Nov, 2014 00:37 IST|Sakshi

పరిగి రూరల్: బిందుసేద్యంతో నీటి వృథాను అరికట్టడమే కాకుండా తక్కువ నీటితో ఎక్కువ సేద్యం చేసేందుకు వీలుంటుందని తెలంగాణ రాష్ట్ర సూక్ష్మ నీటి పారుదల శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని బసిరెడ్డిపల్లిలో కావలి మల్లేష్ వ్యవసాయ పొలంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బిందుసేద్యంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా బాబు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకే గ్రామీణ ప్రాంతాల్లో డ్రిప్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులు ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు సాగు చేస్తున్నారన్నారు. కాల్వల ద్వారా పొలాలకు నీరందిస్తూ వ్యవసాయం చేయడం వల్ల నీరు వృథా అవుతోందన్నారు.

 దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న డ్రిప్ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డ్రిప్ కావాల్సిన రైతులు ఆల్‌లైన్‌లో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. బిందు సేద్యం ద్వారా పొలాలకు నీరందిస్తున్న రైతులు మూడు నెలలకోసారైనా డ్రిప్ పైపుల్లో పట్టిన నాచును తొలగించేందుకు యాసిడ్ ట్రీట్‌మెంట్ చేయాలన్నారు.

 అనంతరం యాసిడ్ ట్రీట్‌మెంట్ చేసే విధానం గురించి రైతులకు అర్థమయ్యేలా చేసి చూపించారు. అవగాహన సదస్సులో మైక్రో ఇరిగేషన్ జిల్లా కో ఆర్డినేటర్ బిచ్చయ్య, నెటాఫిమ్ కంపెనీ ప్రతినిధులు మధుప్రసాద్, జీవన్‌రెడ్డి, ఏరియా ఆఫీసర్ రాంరెడ్డి విజయ్, రాజనర్సింహులు, బాగన్న, శ్రీశైలం, జగన్‌మోహన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, వినాయకరెడ్డి, నర్సింహులు,వెంకటయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు