బాలికలను కాపాడుకుందాం..

12 Oct, 2014 00:53 IST|Sakshi
బాలికలను కాపాడుకుందాం..

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, తరుణి స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా బేగంపేట్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘బాలికలను కాపాడుకుందాం’ అన్న సందేశంతో బైక్‌థాన్ పేరిట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వరకు దాదాపు 500 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు.

అంతకుముందు నిజామాబాద్ ఎంపీ కవితతోపాటు అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్, క్రైం ఎస్పీ పద్మజ, ఏపీ ఫారెస్ట్ అకాడమీ డెరైక్టర్ రఘువీర్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు తదితరులు ఆడ పిల్లలకు రక్షణగా ఉంటామని ప్రతినబూనారు. తోడు-నీడగా ఉండి వారి అభివృద్ధిని కాంక్షిస్తామని, ఆర్థికంగా, సామాజికంగా వారి ఎదుగుదలకు తోడ్పాటునందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ మగ పిల్లలతో పోలిస్తే ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉండడం బాధాకరమన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మమతారఘువీర్, అచ్యుతరావు, రహీముద్దీన్ మాట్లాడుతూ 2001-2011 జనాభా లెక్కల ప్రకారం అమ్మాయిల శాతం గణనీయంగా పడిపోయిందన్నారు.

అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా హక్కులు పొందే రోజులు రావాలన్నారు. హక్కుల కోసం పోరాడిన మలాల మాదిరిగా బాలికలు ముందుకు రావాలన్నారు. అంతర్జాతీయ బాలికల వారోత్సవాలను పురస్కరించుకుని బాలికల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈనెల 15న సైదాబాద్ కాలనీలోని గీతాంజలి విద్యాలయంలో చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు, తరుణి సంస్థ అధినేత్రి హేమలత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు