నోచందా..దందా..ప్రజాసేవే పరమావధి

24 May, 2014 03:32 IST|Sakshi
నోచందా..దందా..ప్రజాసేవే పరమావధి

కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా.. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా.. పల్లెలు, గిరిజనతండాలు తిరిగాను.. సామాజిక రుగ్మతలపై ప్రజలకు అవగాహన కల్పించాను.. తండాల్లోని సమస్యలపై అధ్యయనం చేశాను.. తెలంగాణ ఉద్యమ సమయంలో జాక్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశాను.. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన క్రమంలో ఇప్పుడు ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను.. ఎంపీగా విజయం సాధించాను.. తనను గెలిపించిన ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తాను.. చందా.. దందా.. పర్సంటేజీలు తీసుకోకుండా ప్రజా సేవకే అంకితమవుతా.. అని అంటున్నారు మాను కోట ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్. ‘న్యూస్‌లైన్’ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.
 
న్యూస్‌లైన్, కేయూ క్యాంపస్: హబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుడుంబాను కుటీర పరిశ్రమగా ఎంచుకుని దానికే బానిసలవుతున్నారు. యుక్త వయసులోనే అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. గుడుంబా విక్రయిస్తున్న వారిపై ఇప్పటివరకు నాలుగు లక్షల కేసులున్నాయి. గుడుంబా తయారీ నుంచి వారికి విముక్తి కల్పించడానికి ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గం చూపించాలి. గిరిజన, గిరిజనేతరుల్లో డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. కొందరు గిరిజనులు పేదరికంతో పసిపిల్లలను అమ్ముకునే దుస్థితి నెలకొంది.
 
 ప్రస్తుతం గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్ సరిపోవడం లేదు. దానిని కనీసం 12 శాతం చేయాల్సిన అవసరం ఉంది. తాను ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్‌గా ఉన్నప్పుడు యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలను తిరిగినప్పుడు అనేక సమస్యలపై అధ్యయనం చేశాను. దీనిపై ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించాను. గిరిజనుల సమస్యలపై చట్టసభల్లో అంతగా ప్రస్తావనకు రాలేదు. గిరిజనేతరుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తాను. రాజకీయాల్లోకి రావడం వల్ల కొన్ని సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది.
 
పుష్కలంగా సహజ వనరులు
పార్లమెంట్ పరిధిలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా బయ్యారంలో లక్షల ఎకరాల్లో ఐరన్‌ఓర్ నిక్షేపాలు ఉన్నాయి. రాబోయే టీఆర్‌ఎస్ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టేలా తనవంతు కృషి చేస్తాను. ఇక్కడ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే గిరిజన, గిరిజనేతర యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
 
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి

గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఇక్కడ ఏర్పాటు చేస్తే రెండు జిల్లాల్లోని ఎంతోమంది గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అందించడమే కాకుండా సంస్కృతిని కూడా పెంపొందించే విధంగా ఉంటుంది. పాకాల, రామప్ప, లక్నవరం లాంటి సరస్సులు ఉన్నాయి. వీటిని కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ ఫెస్టివల్‌గా గుర్తించేలా కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడానికి కృషి చేస్తాను.
 
కేయూను సెంట్రల్ యూనివర్సిటీగా చేస్తా..
కేయూను సెంట్రల్ యూనివర్సిటీగా చేయాలనే డిమాండ్ ఉంది. దీనికోసం తనవంతు కృషి చేస్తాను. కేయూలో టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. కొత్త పాలక మండలిని ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
 
ఉద్యమ ప్రస్థానం.. సామాజిక సేవ
వెంకటాపూర్ మండలం మల్లయ్యపెల్లితండా(నారాయణపూర్)కు చెందిన అజ్మీరా లక్ష్మణ్, మంగమ్మ దంపతులకు సీతారాంనాయక్ జన్మించారు. కిలోమీటరున్నర దూరంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి చదువుకున్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు ములుగుఘనపూర్‌లో చదువుకున్నారు. పదో తరగతి హన్మకొండలోని లష్కర్ బజార్ స్కూల్‌లో, హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, కేడీసీలో బీఎస్సీ చదువుకున్నారు.

కేయూ 1979-1981లో ఎమ్మెస్సీ(బాటనీ) పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1984లో నియమాకమయ్యారు. 1994లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అప్పట్లో లంబాడీ గిరిజన తెగ నుంచి సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ పొందిన వారిలో మొదటివారు. 1995 వరకు అక్కడే పనిచేసిన ఆయన హన్మకొండ కేడీసీకి బదిలీ అయ్యారు. ఆ తరువాత కేయూలో 2002 నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి ప్రస్తుతం ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా, కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. దీని ద్వారానే సమాజంలోని అనేక సమస్యలను కూడా తెలుసుకునే అవకాశం కలిగింది.
 
మూఢ నమ్మకాలు, ఎయిడ్స్ లాంటి సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కేయూ పాలక మండలి సభ్యుడిగా కీలక పాత్ర పోషించారు. కేయూ ఎగ్జామినేషన్ రీఫార్మేషన్ కమిటీ సభ్యుడిగా, పీజీ కళాశాలల స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశారు. కేయూ అడ్మిషన్ల డెరైక్టర్‌గా, ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా, ఎస్‌డీఎల్‌సీఈ సలహా మండల సభ్యుడిగా, పీజీ అడ్మిషన్ల జాయింట్ డెరైక్టర్‌గా పనిచేశారు.

కర్ణాటకలోని గుల్బార్గా యూనివర్సిటీ, బీహార్‌లోని లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయంతోపాటు అమెరికా, నేపాల్, థాయ్‌లాండ్ లలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించారు. రాష్ట్రంలోని 35 తెగలకు సంబంధించిన గిరిజనులపై, ముఖ్యంగా అధిక శాతం ఉన్న లంబాడీల మరణాలు, పసిపిల్లల అమ్మకాలపై పరిశోధన చేశారు.
 
పలు పదవులు
బాటనీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే  తెలంగాణ ఐక్య కార్యాచరణ సభ్యులు(టీజాక్)గా, తెలంగాణ యూనివర్సిటీ ట్రైబల్ ప్రొఫెసర్స్ అధ్యక్షుడిగా, ఆలిండియా బంజార సేవాసంగ్ కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు.

రైల్వే లైన్‌కు కృషి
ఖమ్మం జిల్లా మణుగూరు వరకు రైల్వే లైను ఉంది. ఇల్లెందు వరకు కొంత, భద్రాచలం వరకు కూడా రైల్వే లైను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనిని పూర్తి చేయించేందుకు కృషి చేస్తాను. మహబూబాబాద్, డోర్నకల్ రైల్వేస్టేషన్లలోని సమస్యలు, పలు రైళ్ల నిలుపుదల కోసం ప్రయత్నిస్తాను.

మరిన్ని వార్తలు