పంచాయతీ ఎన్నికల పైసలిస్తేనే పనిచేస్తాం 

18 Mar, 2019 16:45 IST|Sakshi
పారితోషికం చెల్లించాలని శిక్షణ  తరగతులను బహిష్కరించిన ఉపాధ్యాయులు 

ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆందోళన

లోక్‌సభ ఎన్నికల శిక్షణను కొద్దిసేపు బహిష్కరణ 

కలెక్టర్‌ హామీతో శిక్షణకు హాజరు 

సాక్షి, వికారాబాద్‌ అర్బన్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్టేజ్‌–1, 2 ఉద్యోగులుగా పనిచేసిన ఏ ఒక్కరికీ ఇప్పటివరకు భత్యం ఇవ్వలేదని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని మండలాల్లో పీఓలకు, ఏపీలుగా విధులు నిర్వహించిన వారికి కూడా డబ్బులు ఇవ్వలేదని ఉపాధ్యాయులు మండిపడ్డారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల శిక్షణను ఆదివారం కొంతసేపు బహిష్కరించారు. చివరకు కలెక్టర్‌ హామీతో శిక్షణకు ఉపాధ్యాయులు హాజరయ్యారు. వికారాబాద్‌ నియోజకవర్గం పరిధిలో ఉపాధ్యాయులకు ఆదివారం జిల్లాకేంద్రం వికారాబాద్‌లోని బాలుర ఉన్నత పాఠశాలలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ అరుణకుమారి పలు విషయాలను వివరించే ప్రయత్నం చేశారు.

  
ఆ సమయంలో పలువురు ఉపాధ్యాయులు కలగజేసుకుని పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇవ్వాల్సిన భత్యం ఇవ్వాలని, లేకపోతే శిక్షణను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఒకే జిల్లాలో రెండు, మూడు రకాలుగా భత్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధ్యాయులతో ఎన్నికల పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వక పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఉపాధ్యాయులు వినకుండా శిక్షణ తరగతులను కొద్దిసేపు బహిష్కరించారు. సమాచారం అందుకున్న కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా శిక్షణ కేంద్రానికి వచ్చి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చలు జరిపారు.

సిబ్బంది ఎంత డబ్బులు చెల్లించారనే విషయంపై పూర్తి వివరాలు సేకరిస్తామని, అప్పటి పంచాయతీ అధికారులు ఇప్పుడు లేకపోవడం కొంతఇబ్బందిగా మారిందని కలెక్టర్‌ వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ప్రతి ఉద్యోగికి అందరితో సమానంగా, నిబంధనలకు లోబడి రెమ్యూనరేషన్‌ ఇప్పిస్తానని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలపడంతో ఉపాధ్యాయులు శిక్షణ తరగతులకు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు