మా ఆదేశాలే పట్టించుకోవడం లేదు

11 Oct, 2014 01:01 IST|Sakshi
మా ఆదేశాలే పట్టించుకోవడం లేదు

రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై  సమాచార కమిషనర్ల అసంతృప్తి
 
 హైదరాబాద్: చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే తీవ్ర నిర ్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ సాక్షాత్తూ రాష్ట్ర సమాచార కమిషనర్లే అసంతృప్తి వ్యక్తంచేశారు. సమాచార హక్కు చట్టం అమలుకు సంబంధించి తామిచ్చే ఆదేశాలకు ఇరు రాష్ట్రాల అధికారులెవరూ వీసమెత్తు విలువ కూడా ఇవ్వడం లేదని ఏపీ సమాచార కమిషన్‌లోని 8 మంది క మిషనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో కమిషన్ ఆధ్వర్యంలో సమాచార హక్కు వారోత్సవాలను నిర్వహించారు. తమ ఆదేశాలనే పట్టించుకోవడం లేదని కమిషనర్లు అసంతృప్తి వ్యక్తంచేయడంతో.. కార్యక్రమానికి వచ్చిన ఆర్టీఐ ఉద్యమకారులు కంగుతిన్నారు. తమ ఆవేదన లను వెళ్లబోసుకునేందుకు కూడా కమిషనర్లు సమయం ఇవ్వకపోవడంతో ఉద్యమకారులు కాసేపు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం ఆర్టీఐ ఆమలు ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఈ చట్టంతో పలువురు అధికారులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధాన సమాచార కమిషనర్ జన్నత్‌హుస్సేన్, స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రాహి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమాచార కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన వారికి సమాచారం ఇచ్చేందుకు పలు ప్రభుత్వ విభాగాలు ఇష్టపడడం లేదని, అప్పిలేట్ అథారిటీలు పట్టించుకోవడం లేదన్నారు. విభాగాధిపతులు కనీసం స్పందించడం లేదన్నారు. మరో కమిషనర్ విజయబాబు మాట్లాడుతూ.. సమాచార కమిషన్ నిర్వహిస్తున్న వారోత్సవాలకు ప్రభుత్వ విభాగాలకు చెందిన పీఐవోలు, అప్పిలేట్ అథారిటీలు, విభాగాధిపతులు ఎక్కువ మంది రాకపోవడాన్ని ప్రస్తావించారు. ఆర్టీఐ అమలు మొక్కుబడి కార్యక్రమంగానే ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) హోదా కలిగిన కమిషనర్ల పట్ల పలువురు ఐఏఎస్ అధికారులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు