సీఎం గొప్పగా పనిచేస్తున్నారని విన్నాం...

1 Mar, 2019 04:03 IST|Sakshi

ఈ సమస్య పరిష్కారానికి ఆయనకు 10 నిమిషాలు

చాలుకల్యాణ్‌నగర్‌ సొసైటీ భూమిపై4 వారాల్లో నిర్ణయం తీసుకోండి

ప్రభుత్వానికి తేల్చి చెప్పిన హైకోర్టు

ముఖ్యమంత్రి చాలా గొప్పగా పనిచేస్తున్నారని విన్నాం. ఆయన ఈసమస్యను 10 నిమిషాల్లో పరిష్కరించగలరని నమ్మకం ఉంది. మీరేమో 8 వారాల సమయం కావాలంటున్నారు. పిటిషనర్‌ సొసైటీ నుంచి తీసుకున్న భూమికి సమానమైన భూమిని ఇస్తారని మీరే ఉత్తర్వులిచ్చారు.

ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో మేం కూడా ఆదేశాలిచ్చాం. మీ ఉత్తర్వులను పట్టించుకోరు. మా ఉత్తర్వులను కూడా పట్టించుకోకుంటే ఎలా. మీరు (అధికారులు) ఇలా గడువు కోరుతుండటం వల్లే న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. మేం చెప్పిన ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లండి.
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారిని ఉద్దేశించి హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: యూసుఫ్‌గూడలోని కల్యాణ్‌నగర్‌ సొసైటీ నుంచి తీసుకున్న భూమికి సమానమైన భూమిని ఆ సొసైటీకి ఇచ్చే విషయంలో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వు లు జారీ చేసింది. కల్యాణ్‌నగర్‌ సొసైటీ 1964లో 39 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. లేఔట్‌ నిమిత్తం అనుమతులు తీసుకుంది.

తరువాత ప్రభుత్వం ఈ భూమిని మురికివాడల అభివృద్ధి కోసం తీసుకుంది. దీనిపై సొసైటీ హైకోర్టును ఆశ్రయించగా, తీసుకున్న భూమికి సమానమైన భూమిని ఇస్తామని కోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు జీవో లు కూడా ఇచ్చింది. అయితే, ఈ జీవోలు ఇప్పటివర కు అమలు కాకపోవడంతో సొసైటీ కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
 
తివారీని కోర్టుకు పిలిపించిన ధర్మాసనం
ఏళ్ల తరబడి ఈ సమస్యను పరిష్కరించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ధర్మాసనం మండిపడింది. దీనిపై స్వయంగా హాజరై వివర ణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రాజేశ్వర్‌ తివారీని ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అనంతరం జరిగిన విచారణకు తివారీ హాజరయ్యారు. తీసుకున్న భూమికి సమానమైన భూమి ఇస్తానని జీవోలు జారీ చేసి ఇప్పటివరకు వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిం చింది. ప్రభుత్వం వద్ద ఫైల్‌ పెండింగ్‌లో ఉందని తమకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారని, భూమి ఇవ్వకుండా వారిని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పడమేనా మీ పని అంటూ ప్రశ్నించింది. 

పెండింగ్‌ కేసులు పెరగక ఏం చేస్తుంది?
ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందని, ఇందుకు బాధ్యులెవరని అడిగింది. పూర్తి వివరాలతో మరో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని తివారీ చెప్పగా, ‘ఆ పని ముందే ఎందుకు చేయకూడదు. మీరు తీరు బడిగా మరో పిటిషన్‌ దాఖలు చేస్తారు. దానికి సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని పిటిషనర్‌ కోరతారు. కోర్టుల్లో పెండింగ్‌ కేసులు పెరిగిపోతాయంటే ఎందుకు పెరగవు. ఇలా వాయిదాల మీద వాయిదా లు తీసుకుంటూ తీరుబడిగా అఫిడవిట్లు వేసుకుంటే కేసుల పరిస్థితి అలాగే ఉంటుంది’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలతోపాటు మీరిచ్చిన ఉత్తర్వులను ఎప్పటిలోపు అమలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించగా, కోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి నడుచుకుంటామని తివారీ చెప్పారు. 

సీఎం దృష్టికి తీసుకెళ్లండి...
దీనిపై ఎప్పటిలోపు నిర్ణయం తీసుకుంటా రో  చెప్పాలని కోర్టు తివారీని ప్రశ్నించగా.. 8 వారాల గడువు కావాలని సమాధానమిచ్చారు. ‘మీ సీఎం చాలా గొప్పగా పనిచేస్తున్నారని విన్నాం. మేం విన్న దానిని బట్టి ఈ సమస్య పరిష్కారానికి ఆయనకు 10 నిమిషాల సమయం చాలు. ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లండి. ఆయనే పరిష్కరిస్తారు’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు