‘చేనేత’పై జీఎస్టీని  తొలగించండి: రాపోలు

28 Dec, 2018 05:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చేనేత రంగంపై జీఎస్టీ భారాన్ని తొలగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌ విన్నవించారు. గురువారం ఆయన జైట్లీని కలసి వినతిపత్రం సమర్పించారు. జీఎస్టీ కారణంగా చేనేత కార్మికులు, చేతివృత్తి కార్మికులు పన్ను భారంతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. చేనేత, హస్తకళలకు ఉపయోగించే ముడిసరుకుపై ఎలాంటి పన్ను భారం మోపరాదని కోరారు. చేనేత, జౌళిపై జీఎస్టీ కారణంగా చైనా, ఇతర దేశాల నుంచి సంబంధిత ఉత్పత్తుల దిగుమతులను పరోక్షంగా ప్రోత్సహించినట్టు అవుతోందని తెలిపారు. అలాగే రైతాంగం ఉపయోగించే వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై కూడా జీఎస్టీని తొలగించాలని విన్నవించారు. వచ్చే నెల జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని జైట్లీ హామీనిచ్చినట్టు రాపోలు మీడియాకు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు