‘టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వం’

10 Dec, 2018 13:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయనే నానుడి ఉందని, అది కాంగ్రెస్‌కు జరుగబోతుందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ చేసిన అనాలోచిత నిర్ణయం కారణంగా అభివృద్ధిపై జరగాల్సిన చర్చ ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్‌పై జరిగిందని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ మళ్లీ అమరావతికి సర్దుకోవాలని ఎద్దేవా చేశారు. రేపు (మంగళవారం) వెలువడే ఫలితాలు కాంగ్రెస్‌, టీడీపీ చెంప చెల్లుమనిపిస్తాయని జోస్యం చెప్పారు. టీపీసీపీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి గడ్డం గీసుకునే యోగం లేదని, కొందరు కాంగ్రెస్‌ నేతలకు డబుల్‌ డిజిట్‌ ఓట్లు కూడా రావని అన్నారు. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేది లేదని, తాము ఆ పార్టీకి వ్యతిరేకమని ఆయన వెల్లడించారు.

ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ విఫలమైతే టీఆర్‌ఎస్‌పై పోరాడింది తామేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు ఎలాంటి తీర్పును ఇచ్చినా ఆహ్వానిస్తామని, ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ నేతలు ముందుగానే గవర్నర్‌ను కలుస్తున్నారని పేర్కొన్నారు. తాము పక్కరాష్ట్ర సీఎంను నెత్తిన పెట్టుకునే తిరగలేదని, చంద్రబాబు అ‍డ్రస్‌ గల్లంతుకావడం ఖాయమని తెలిపారు. ఓ వ్యక్తికి, శక్తికి వ్యతిరేకంగా నేతలంతా ఢిల్లీలో సమావేశం అవుతున్నారని, అధికారం కోసమే వాళ్లు కూటమి కడుతున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు