ఆ 'నలుగురు' మాకే కావాలి

1 Jan, 2015 12:41 IST|Sakshi
ఆ 'నలుగురు' మాకే కావాలి

ఐఏఎస్ అధికారులపై కేంద్రానికి టీ సర్కారు లేఖ
 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారుల కోసం పట్టుపడుతోంది. వారిని తెలంగాణలోనే  కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారి సోమేశ్‌కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ జయేశ్ రంజన్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్‌లను తెలంగాణలోనే కొనసాగించాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
 
తెలంగాణలో  పనిచేస్తున్న ఈ నలుగురు అధికారులను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. వీరిని ఇప్పటికిప్పుడే రిలీవ్ చేయొద్దన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏపీకి కేటాయించిన అధికారులందర్నీ ఒకేసారి రిలీవ్ చేస్తే.. అక్కడ్నుంచి రావాల్సిన అధికారుల విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా పాలన వ్యవస్థ స్తంభించిపోతుందని సర్కారు భావిస్తోంది. అందుకే అధికారులను దశల వారీగా రిలీవ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించిన అధికారులను ఆ ప్రభుత్వం జనవరి 1 లేదా 2వ తేదీల్లో రిలీవ్ చేసే అవకాశం ఉందన్న సమాచారం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి స్పంది స్తోంది.
 
తెలంగాణ ప్రభుత్వం నలుగురు అధికారులను ఈ రాష్ట్రంలోనే కొనసాగించాలని కోరినట్టుగానే.. ఏపీ సర్కారు కూడా నలుగురు అధికారులను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు సమాచారం. అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనల ప్రకారం ఒకే నగరంలో బదిలీ అయినా.. కేడర్ మారిన అధికారులను రిలీవ్ చేసిన 24 గంటల్లోగా వారు విధుల్లో చేరాల్సి ఉంటుంది. అదే వేరే ప్రాంతంలో ఉంటే వారం రోజుల గడువు ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు వివరించారు.

మరిన్ని వార్తలు