తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

10 May, 2018 01:18 IST|Sakshi

  పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ 

  సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

సాక్షి, హైదరాబాద్‌/సిద్దిపేట: అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బుధ వారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుద్దెడ, సిద్దిపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ సాగుతోందన్నారు. ఈ ఏడాది రబీలో 38 లక్షల మెట్రిక్‌ టన్ను ల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

రైతులకు అందుబాటులో 3,008 కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి 17% తేమకు లోబడి ఉండేలా చూసి విక్రయించాలన్నారు. 2,962 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.36 లక్షలమంది రైతుల నుంచి రూ.2,526 కోట్ల విలువ చేసే 15.91 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నా రు. ఇందులో 15.01 లక్షల మెట్రి క్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.1,400 కోట్లు జమ చేశామన్నారు.  ముందస్తు వర్ష సూచనలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వీలైనంత త్వరగా రైస్‌ మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్‌ విషయంలో మిల్లర్లు వేగంగా స్పందించాలన్నారు. ఇదే అంశంపై ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు.
 
టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోండి 
11వ తేదీ నుంచి వర్షాలు కురిసే సూచనలున్నాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల దృష్ట్యా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. 38 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు 9.78 కోట్ల గోనె సంచులు అవసరం కాగా, ఇప్ప టికే 9.31 కోట్ల సంచులను అందుబాటులో ఉంచామన్నా రు. ఈ పర్యటనలో అకున్‌ సబర్వాల్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్, డీఎస్‌వో వెంకటేశ్వర్లు ఉన్నారు.   

మరిన్ని వార్తలు