విద్యుత్‌ బిల్లులపై సందేహాలు తీరుస్తాం 

12 Jun, 2020 04:37 IST|Sakshi

అనుమానాలుంటే వినియోగదారులు సంప్రదించాలి

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: గత మూడు నెలలకు సం బంధించి ఒకేసారి రీడింగ్‌ తీయడం వల్ల బిల్లులు అధికంగా వచ్చాయని కొంతమంది విద్యుత్‌ వినియోగదారులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సందేహాలు తీర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జీ రఘుమారెడ్డి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సంస్థ పరిధిలోని అన్ని విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తమ బిల్లుకు సంబంధించిన సందేహాలను తీర్చుకోవచ్చని స్పష్టంచేశారు. సంస్థ మెయిల్‌ ఐడీ  customerservice@tssouthernpower.com, ట్విట్టర్‌ ఖాతా TsspdclCorporat@twitter,  ఫేస్‌బుక్‌ ఖాతా  gmcsc.tsspdcl@facebook. com లకు అందుకున్న ఫిర్యాదులను 2 పని దినములలో పరిష్కరించి బిల్లింగ్‌ వర్క్‌ షీట్‌ ద్వారా వినియోగదారునికి జవాబు పంపాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలియజేశారు. వినియోగదారులు తమ విద్యుత్‌ వాడకం బిల్లులపై ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్న యెడల తమ బిల్‌ పైభాగంలో ముద్రించిన ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్‌ (ఉఖౖ)ను సంప్రదించి గాని (లేదా) పైన పేర్కొన్న సంస్థ ఈ మెయిల్‌/ట్విట్టర్‌/ పేస్‌బుక్‌ పేజీకి పంపి తమ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు