అందుకోసం ఉద్యమం చేస్తాం: కోదండరాం

15 Feb, 2019 14:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంటలకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమం చేస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. శనివారం జాతీయ రహదారుల మీద రైతుల వంటావార్పు ఉంటుందని వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. నిజామాబాద్ ఎర్రజొన్న, ఆర్మూర్ పసుపు పంట రైతులు సమస్యల్లో ఉన్నారని తెలిపారు. రైతులు పసుపు పంట అమ్ముకోవటానికి తెలంగాణలో మార్కెట్ కూడా లేదన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. పసుపు బోర్డు వస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుందని అన్నారు.

పసుపు పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని, పత్తి, మిర్చి, కందులు, జొన్న రైతులు చాలా దెబ్బ తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రుల క్యాబినెట్ లేకపోవడంతో సమస్యలు నివేదించే పరిస్థితి లేదని చెప్పారు. వ్యవసాయ శాఖకు మంత్రి కూడా లేడన్నారు. పంటకు గిట్టుబాటు ధర కోరితే ప్రభుత్వం దాడులు చేస్తోందని మండిపడ్డారు. పసుపుకు క్వింటాలుకు 15 వేల రూపాయలు, ఎర్రజొన్నలకు క్వింటాలుకు రూ.3500 మద్ధతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు