విమానయానాన్ని మరింత చేరువ చేస్తాం

11 Oct, 2018 01:59 IST|Sakshi
ఇంటరిమ్‌ ఇంటర్నేషనల్‌ డిపార్చర్‌ టెర్మినల్‌

శంషాబాద్‌లో ఇంటరిమ్‌ ఇంటర్నేషనల్‌ డిపార్చర్‌ టెర్మినల్‌ 

ప్రారంభోత్సవంలో నయన్‌ చౌబే

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో వైమానిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో మరింత మందికి విమానయానాన్ని చేరువ చేస్తామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ నయన్‌ చౌబే తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో కలసి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటరిమ్‌ ఇంటర్నేషనల్‌ డిపార్చర్‌ టెర్మినల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌబే మాట్లాడుతూ. అత్యంత ఆధునిక సదుపాయాలతో కేవలం 6 నెలల సమయంలో ఇంటరిమ్‌ ఇంటర్నేషనల్‌ డిపార్చర్‌ టెర్మినల్‌ను జీఎంఆర్‌ సంస్థ నిర్మించడాన్ని ఆయన అభినందించారు. రానున్న రోజుల్లో ఆధార్‌ తరహాలో డిజియాత్ర సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులు తనిఖీలు లేకుండా ఫేస్‌ రికగ్నైజేషన్‌తో నేరుగా విమానం ఎక్కవచ్చని చెప్పారు. సీఎస్‌ ఎస్‌కే జోషి మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టును అనుసంధానం చేసేలా ఎక్స్‌ప్రెస్‌ హైవేలు, ఓఆర్‌ఆర్‌లకు తోడుగా త్వరలోనే మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. ఏటా పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఈ టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామనిఅన్నారు.  కార్యక్రమంలో  జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) సీఈవో ఎస్టీకే కిశోర్, హైదరాబాద్‌ కస్టమ్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌కుమార్, ఐబీ జాయింట్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టుల బిజినెస్‌ చైర్మన్‌ జీబీఎస్‌ రాజు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు