ఫేస్‌బుక్‌ విస్తరణకు సహకరిస్తాం

30 Nov, 2017 04:31 IST|Sakshi
బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ఫేస్‌బుక్‌ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌

ఐటీ మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌ సంస్థ అమెరికా వెలుపల తమ అతి పెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని, భవిష్యత్తులో ఇక్కడ కొత్త విభాగాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే అన్ని విధాలుగా సహకరిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో బుధవారం కేటీఆర్‌తో ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ పాలసీ విభాగాధిపతి జేమ్స్‌ హెయిర్ట్సన్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగం ఉపాధ్యక్షుడు యష్‌ జావేరీ, పబ్లిక్‌ పాలసీ విభాగం డైరెక్టర్‌ అంకిదాస్‌ సమావేశమయ్యారు. ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ, డేటా అనలిటిక్స్‌ రంగాల్లో ఫేస్‌బుక్‌ అందిస్తున్న సేవలను వారు మంత్రికి వివరించారు. టీ–హబ్‌తో కలసి ఫేస్‌బుక్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపైనా చర్చ జరిగింది. జీఈఎస్‌ను ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తోందని ఫేస్‌బుక్‌ ప్రతినిధులు కేటీఆర్‌ను ఈ సందర్భంగా అభినందించారు.

‘ఫ్యూయల్‌ ఫర్‌ స్టార్టప్స్‌’ పుస్తకావిష్కరణ
ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్‌ థిల్లై రాజన్‌ రచించిన ‘ఫ్యూయల్‌ ఫర్‌ స్టార్టప్స్‌’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ఆవిష్కరించారు. స్టార్టప్‌లు, వెంచర్‌ క్యాపిటల్‌ రంగాలపై రాసిన ఈ పుస్త కం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగకరమని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఆస్ట్రేలియన్‌ హైకమిషనర్‌తో కేటీఆర్‌ సమావేశం
ఆస్ట్రేలియన్‌ హైకమిషనర్‌ హరీందర్‌ సిద్దుతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్య, గనులు, యానిమేషన్, గేమింగ్‌ రంగాల్లో ఆస్ట్రేలియన్‌ కంపెనీలకు ఉన్న పెట్టుబడుల అవకాశాలను ఆయనకు కేటీఆర్‌ వివరించారు. ఆస్ట్రేలియా యూనివర్సిటీలకు ఉన్నత చదు వుల కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగు తోందని, ఆ యూనివర్సిటీల భాగస్వామ్యంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు