వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది 

8 Jul, 2019 02:34 IST|Sakshi

ఈ అంశంపై ప్రధానితో మాట్లాడుతా

మాదిగల ఆత్మగౌరవ సభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

నాగులుప్పలపాడు: మాదిగల చిరకాల వాంఛ అయిన ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంటుందని, దీనిని సాధించే క్రమంలో కేంద్రస్థాయిలో తమ పనిని ప్రారంభించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) ఏర్పడి 25 ఏళ్లయిన సందర్భంగా సంస్థ పురుటిగడ్డ అయిన ఏపీలోని ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడిలో మాదిగల ఆత్మగౌరవ జాతర సభను ఆదివారం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్‌ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అధ్యక్షత వహించిన సభలో కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్సీలలో ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల నష్టపోతున్న మాదిగ, ఉప కులాలకు న్యాయం చేయా లని పాతికేళ్ల కిందట ప్రారంభమైన ఉద్యమం.. ఎస్సీల వర్గీకరణ లక్ష్యం నెరవేర్చుకునేందుకు అనేక పోరాటాలు చేసిందన్నారు. దేశంలో బీసీల వర్గీకరణపై ప్రధాని మోదీ ఓ కమిటీ వేశారని, ఎస్సీ వర్గీకరణపై తానే ప్రధానితో మాట్లాడనున్నట్లు తెలిపారు.
 
మాదిగల ఆకాంక్షను నెరవేర్చాలి: మంద కృష్ణ 
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగల చిరకాల వాంఛ అయిన వర్గీకరణను కేంద్ర సహకారంతో సాధించి మాదిగల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఎస్సీలలో వర్గీకరణకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ  దళితుల చిరకాల కోరిక అయిన వర్గీకరణను బీజేపీ ప్రభుత్వం సత్వర మే చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమారుడు ఎం.హర్ష, ఎం.గురునాథం, అరుణోదయ సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, నేతలు జెల్లి విల్సన్, ఆకుల విజయ,  గోవర్ధన్,  రావెల కిషోర్,  ప్రముఖ కవులు కొలకలూరి ఇనాక్, ఎజ్రాశాస్త్రి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు