న్యాయవాదుల సంక్షేమానికి కృషి  

7 Jun, 2018 09:17 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి  

ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిది

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి

షాద్‌నగర్‌టౌన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాదులు చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర బార్‌ అసోసియోషన్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం న్యాయవాదులు ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని పోరాటం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని తెలిపారు.

న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ ఏడాది ఏపీ, తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్స్‌కు వేర్వేరుగా ఎన్నికలు జరగనున్నాయన్నారు. మరోసారి న్యాయవాదులు అవకాశం కల్పించి రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా తనను ఎన్నుకోవాలని కోరారు. న్యాయవాదుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో అడ్వకేట్‌ అకాడమీ, లీగల్‌ సర్వీసెస్‌  ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.

అదేవిధంగా జూనియర్‌ న్యాయవాదులను లాభం చేకూర్చే విధంగా వారికి ఉపకార వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. విశ్రాంత న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరికీ ఉపయోగపడే విధంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా న్యాయవాదులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, తెలంగాణ అడ్వకేట్స్‌ ఫండ్‌ కింద వంద కోట్ల నిధులు ఉన్నాయని, వీటిని న్యాయవాదుల సంక్షేమానికి ఖర్చు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

షాద్‌నగర్‌లో సబ్‌కోర్టు ఏర్పాటు కావడానికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమమే «ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. జూన్‌ 29న నిర్వహించే రాష్ట్ర బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన కోరారు. 22 ఏళ్ల  పాటు బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా, వైస్‌ చైర్మన్‌గా, చైర్మన్‌గా ఎన్నో సేవలు అందించానని, మరిన్ని సేవలు అందించేందుకు తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో న్యాయవాదులు చెంది మహేందర్‌రెడ్డి, మోముల బసప్ప, కంచి రాజ్‌గోపాల్, పాతపల్లి కృష్ణారెడ్డి, మధన్‌మోహన్‌రెడ్డి, జగన్, శ్రీనివాస్, ప్రణీత్‌రెడ్డి, కవిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు