సేవకుల్లా పనిచేస్తాం

3 Jun, 2014 23:52 IST|Sakshi
సేవకుల్లా పనిచేస్తాం

గజ్వేల్, న్యూస్‌లైన్: నాయకుల్లా కాకుండా సేవకుల్లా పనిచేసి నవతెలంగాణ నిర్మాణానికి కృషిచేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీష్‌రావు అన్నారు. గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు మంగళవారం ఇక్కడికి వచ్చారు.ఈ సందర్భంగా పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అందరికీ అందేలా ప్రయత్నిస్తామన్నారు.
 
 పభుత్వానికి, ప్రజలకు మధ్య పరస్పర విశ్వాసం, సహకారం ఉంటేనే లక్ష్యాలను చేరుకుంటామన్నారు. సమాజం నాకేమి ఇచ్చిందనే భావనతో కాకుండా నేను సమాజానికి ఏం చేశాననే భావనతో ముందుకెళ్లాలని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గజ్వేల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే నియోజకవర్గ ప్రగతిపై తొలి సమీక్ష ఇక్కడ నిర్వహిస్తున్నారని వివరించారు. అభివృద్ధిలో గజ్వేల్‌ను అగ్రభాగాన నిలుపుతామని వెల్లడించారు. గజ్వేల్-సిద్దిపేట తనకు రెండు కళ్లలాంటివని ఉద్ఘాటించారు. అందువల్లే తాను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఇక్కడికే వచ్చానని చెప్పారు.
 
 కార్యకర్తల మధ్య పుట్టిన రోజు వేడుకలు
 హరీష్‌రావు తన జన్మదిన  వేడుకలను మంగళవారం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకుల మధ్య జరుపుకున్నారు. కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. కార్యక్రమంలో దుబ్బాక, సంగారెడ్డి ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూంరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, రఘుపతిరావు, గజ్వేల్ నగర పంచాయతీ 17వ వార్డు కౌన్సిలర్, పట్టణ ముఖ్య నాయకుడు గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్వీ జిల్లా మాదాసు శ్రీనివాస్ తదితరులు పొల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు