.‘తీన్‌మార్’తో తికమక

11 Mar, 2014 03:21 IST|Sakshi
.‘తీన్‌మార్’తో తికమక

నియోజకవర్గ స్థాయి నేతలకు స్థానిక ఎన్నికలు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. తమకు సహకరించే వారు స్వయంగా ఎన్నికలను ఎదుర్కొంటుండడంతో గ్రామాల్లో రాజకీయ వ్యూహం ఎలా అనేది వీరికి అంతుపట్టడంలేదు.  ఇదే సమయంలో తమను నడిపించే వారు కిమ్మనకపోవడం... బాగోగులు చూసుకోకపోవడంతో ఎన్నికల పోరులో ఎలా అడుగులేయూలో తెలియక ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు డీలా
 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వస్తే లీడర్లు బరిలో ఉంటారు. వారి గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడతారు. అన్ని రకాలుగా పోరాటం సాగిస్తారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్, చైర్మన్... ఈ ఎన్నికలు వస్తే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు బరిలో ఉంటారు. వారిని లీడర్ నడపిస్తారు... గెలిచేవారిని బరిలోకి దించుతారు..

అలిగిన వారిని బుజ్జగిస్తారు. బరిలో దించినవారిని గెలిపించుకుంటారు. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం చేయాల్సినవన్నీ చేస్తారు. రాజకీయ పార్టీలకు సంబంధించి లీడర్, కేడర్‌కు ఉండే ఎన్నికల సంబంధం ఇది. ఇప్పటివరకు ఏ ఎన్నిక అయినా ఇలాగే జరిగింది. ఇప్పుడు ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్ ఎన్నికలు రావడంతో పరిస్థితి మారింది. లీడర్... కేడర్... ద్వితీయ శ్రేణి... గ్రామ స్థాయి నాయకులు ఎవరి ఎన్నికల్లో వారు  తలమునకలయ్యారు. సొంత గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ప్రత్యేకమైనదే కావడంతో ఒక్కొక్కరు ఒక్కో గెలుపు వ్యూహంతో ముందుకుపోతున్నారు. ఈ ప్రత్యేక వ్యూహాలతో రాజకీయ పార్టీల్లో స్వతహాగా ఉండే బంధం గతంలో లాగా గట్టిగా కనిపించడం లేదు. ఇదీ.. వరుస ఎన్నికలతో వచ్చిన మార్పును స్పష్టం చేస్తోంది.
 

 పెద్ద నేతలకు పరీక్ష

 ఐదేళ్లకోసారి వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు, అందులో ప్రాతినిధ్యం వహించే ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకమే. నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో తమ పార్టీ శ్రేణులను ముందుకు నడిపించడంతోపాటు ప్రత్యర్థి వర్గాలకు చెందిన వారిని దగ్గర చేసుకునే వ్యూహంతో ఇవి జరుగుతాయి. క్షేత్రస్థాయి నాయకులు సైతం... ఏ పార్టీ వారు తమ నాయకుడికి మద్దతు తెలిపారనే అంశంతో సంబంధం లేకుండా పని చేస్తారు. అంతిమంగా తమ పార్టీ విజయం కోసం పని చేస్తారు. ఇది నియోజకవర్గ స్థాయి నేతలకు బాగా ఉపకరిస్తుంది. ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. నియోజకవర్గ స్థాయి నేతలకు ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. తమకు సహకరించే వారు స్వయంగా ఎన్నికలను ఎదుర్కొంటుండడంతో గ్రామాల్లో రాజకీయ వ్యూహం ఎలా అనేది వీరికి అంతుపట్టడంలేదు.

ఎన్నికల్లో కీలకమైన రాజకీయ, ఆర్థిక అంశాలను కిందిస్థాయి వరకు చేరే వేసే క్రీయాశీల నాయకులు ఇప్పుడు స్వయంగా పోటీలో ఉండడం... వారి పనిలో వారు నిమగ్నం కావడం ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో తమను నడిపించే వారు కిమ్మనకపోవడం... బాగోగులు చూసుకోకపోవడంతో ఎన్నికల పోరులో ఎలా అడుగులేయూలో తెలియక ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు డీలా పడుతున్నారు.
 

 క్షేత్రం మారింది....

 రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు ఈసారి కొత్త రూపును సంతరించుకున్నాయి. ఒక్క ఎన్నిక వస్తేనే పండుగ వాతావరణం కనిపించే గ్రామాల్లో ఇప్పుడు మూడు ఎన్నికలు వచ్చినా... ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కంటే నెల ముందుగా ... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. ఈ మేరకు గ్రామాల్లో రాజకీయ సందడి మరింత పెరగాల్సి ఉండగా... దీనికి భిన్నంగా ఉంది. నియోజకవర్గ స్థాయి నేతలు ఇప్పుడు గ్రామాలు, మునిసిపల్ ఎన్నికలు జరిగే ఊర్లకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. స్థానిక, మునిసిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై పోటీ చేయాల్సి ఉంటుంది.

పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేసే బీ-ఫారాన్ని ఒక స్థానంలో ఒకరికే ఇస్తారు. అభ్యర్థిత్వం ఆశించే వారు మాత్రం ఎక్కువ మంది ఉంటారు. దీంతో అభ్యర్థిత్వాల ఖరారు అంటేనే... నియోజకవర్గ స్థాయి నాయకులు ఆందోళన పడుతున్నారు. ఒక్కరిని ఖరారు చేస్తే... అభ్యర్థిత్వం ఆశించే వారంతా తిరుగుబాటు చేస్తారు. ఇది సాధారణ సమయాల్లో అయితే పర్వాలేదు. ఎన్నికలు జరిగిన రెండుమూడు నెలలకు వీరంతా శాంతిస్తారు. స్థానిక ఎన్నికలు జరిగిన నెలలోపే సాధారణ ఎన్నికలు వస్తుండడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆభ్యర్థిత్వం ఆశించి నిరాశకు గురైన వారి ఆగ్రహం చల్లారేలోపే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి.

ఈ ప్రభావం వీరిపై ఉంటుంది. ఇది ఎన్నికల ఫలితాలను ప్రభావం చేస్తుంది. ఈ పరిస్థితిని తల్చుకుని నియోజకవర్గ స్థాయి నేతలు స్థానిక సమరానికి దూరంగా ఉంటున్నారు. అంతా కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే అంటున్నారు. ఇది గ్రామాల్లోని వారికి ఆగ్రహం కలిగిస్తోంది. ఇన్నాళ్లు పనిచేస్తున్న వారిలో సమర్థులను గుర్తించే స్థాయి నియోజకవర్గ స్థాయి నేతకే ఉంటుంది. పని చేసేవారిని గుర్తించి అభ్యర్థిత్వం ఖరారు చేసే సమయంలో ఇలా తప్పించుకోవడం ఏమిటనే ప్రశ్నలు నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారుు

మరిన్ని వార్తలు