భానుడి ప్రతాపంతో ప్రజలు బెంబేలు

30 May, 2019 02:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భానుడి ప్రకోపానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు విలవిలలాడుతున్నారు. రోహిణి కార్తె నేపథ్యంలో ఎండలు, వేడి గాలులు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని పేర్కొంది. ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్, హన్మకొండ జిల్లాల్లో అత్యధికంగా 46 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. మెదక్‌లో 45 డిగ్రీలు, రామగుండంలో 45, ఖమ్మంలో 44, భద్రాచలంలో 42, హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.

వడదెబ్బకు 35 మంది మృతి
రాష్ట్రంలో వడదెబ్బకు బుధవారం 35 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 21 మంది, కరీంనగర్‌ జిల్లాలో 8 మంది, ఖమ్మం జిల్లాలో నలుగురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

మరిన్ని వార్తలు