ఈ సమ్మర్‌..సుర్రు

3 Feb, 2020 04:20 IST|Sakshi

‘గ్రేటర్‌’లో ఈ వేసవిలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాదీలపై పడనున్న తీవ్ర ప్రభావం

సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా నమోదు!

సాక్షి, హైదరాబాద్‌: గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో ఈసారి వేసవిలో హైదరాబాద్‌ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనికి సూచకంగా కాంక్రీట్‌ మహారణ్యంలా మారిన మహానగరంలో ఫిబ్రవరి ప్రారంభంలోనే అతినీలలోహిత వికిరణ తీవ్రత (యూవీ ఇండెక్స్‌) ‘7’పాయింట్లకు చేరుకోవడంతో ఉక్కపోత, చర్మం, కళ్ల మంటలతో సిటిజన్లు విలవిల్లాడుతున్నారు.

సాధారణం గా ఈ నెలలో యూవీ సూచీ 5 పాయింట్లకు మించరాదు. ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మే నెలల్లో యూవీ సూచీ 12 పాయింట్లు చేరుకునే ప్రమా దం పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గ్రేటర్‌ విస్తీర్ణంలో హరితం 8 శాతానికే పరిమితం కావడం, ఊపిరి సలపని రీతిలో నిర్మించిన బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల నుంచి ఉష్ణం వాతావరణంలో తేలికగా కలవకుండా భూఉపరితల వాతావరణానికే పరిమితం కావడంతో ఫిబ్రవరిలోనే వికిరణ తీవ్రత పెరిగి ఒళ్లు, కళ్లు మండిపోతున్నాయని హైదరాబాదీలు గగ్గోలు పెడుతున్నారు.

పెరిగే ‘యూవీ’తో ఇక్కట్లు.. 
యూవీ ఇండెక్స్‌ పెరగటంతో ఓజోన్‌ పొర మందం తగ్గి ప్రచండ భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. కిరణాలు మనుషులపై పడుతుండటంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులతో విలవిల్లాడుతున్నారు. ఎండలో ఎక్కువసేపు తిరిగితే కళ్లు, చర్మం మండటం, రెటీనా దెబ్బతినడం వంటివి తలెత్తుతున్నాయి. యూవీ సూచీ సాధారణంగా 5 పాయింట్లకు పరిమితమైతే ఎలాంటి ఇబ్బందులుండవు. 10 పాయింట్లు నమోదైతే ప్రమాదం తథ్యం. 12 పాయింట్లు దాటితే చర్మ కేన్సర్‌లు పెరిగే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో వికిరణ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు సన్‌ స్కిన్‌ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్‌ ధరించాలని, ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు గొడుగు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

హరితహారం పనిచేయలేదు.. 
మహా నగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఉద్యమస్ఫూర్తితో తలపెట్టిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా.. నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు దోహదం చేయలేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో భాగంగా గతేడాది 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూల మొక్కలను పంపిణీ చేశారని.. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీ స్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్‌ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కల్లో 5 శాతం మాత్రమే నాటినట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో గ్రేటర్‌లో గ్రీన్‌బెల్ట్‌ 8 శాతానికే పరిమితమైందని.. ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో గ్రీన్‌బెల్ట్‌ 15 శాతానికి పెరగటం అసాధ్యమని అంటున్నారు. గ్రీన్‌బెల్ట్‌ విషయంలో దేశంలో పలు మెట్రో నగరాల్లో మహానగరం ఏడో స్థానంలో నిలిచిందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.

హరితం తగ్గుముఖం.. 
శతాబ్దాలుగా తోటల నగరం (బాగ్‌) గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇప్పుడు హరిత వాతావరణం రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండటంతో కాంక్రీట్‌ మహారణ్యంలా మారిన నగరంలో హరిత వాతావరణం క్రమేణా కనుమరుగై పర్యావరణం వేడెక్కుతోం ది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్‌ ఉండాల్సి ఉండగా.. నగరంలో కేవలం 8 శాతమే ఉండటంతో నగరంలో ప్రాణవాయువు కనుమరుగై సిటిజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

గ్రీన్‌బెల్ట్‌ శాతం పలు మెట్రో నగరాల్లో ఇలా.. 
స్థానం    నగరం          హరితం శాతం 
1       చండీగఢ్‌          35 
2       ఢిల్లీ                20.20 
3       బెంగళూరు      19 
4       కోల్‌కతా          15 
5       ముంబై            10 
6       చెన్నై               9.5 
7      హైదరాబాద్‌        8

మరిన్ని వార్తలు