రాగల 3 రోజులు సాధారణ వర్షాలు 

24 Jun, 2019 02:21 IST|Sakshi

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి 

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాజస్తాన్‌ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా తూర్పు పశ్చిమ బంగాళాఖాతం వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి వ్యాపించిందని వివరించింది. అలాగే ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రుతుపవనాలు, ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వచ్చే 3 రోజులు చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

నాగర్‌కర్నూలు, మహబూబాబాద్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. కాగజ్‌నగర్, సిర్పూరు, పాలకుర్తిలో 4 సెంటీమీటర్లు.. ఆలంపూర్, నర్సంపేట్, జైనూర్, ఉట్నూరు, పినపాక, జఫర్‌గఢ్, వంకిడిలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. రుతుపవనాలు ప్రవేశించడం, వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. అనేకచోట్ల సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా 28 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హకీంపేట, హన్మకొండల్లో సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు