బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో వర్షాలు..!

13 Aug, 2019 20:31 IST|Sakshi

రాగల మూడురోజులకు వాతావరణ సూచన

ఏపీ తెలంగాణ, యానాంలలో వర్షాలు

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌ : వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో ఇది కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధముగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని చెప్పింది. రాగల మూడురోజులకు వాతావరణ సూచనలు చేసింది. 

అల్పపీడనం కారణంగా తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు (మంగళవారం), రేపు చాలాచోట్ల, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని..  ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడిచింది. ఈరోజు, రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాయలసీమలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు