నేడు, రేపు మోస్తరు వర్షాలు

23 Aug, 2018 01:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం ఉదయం బలహీనంగా మారడంతోపాటు ఉత్తర మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. వాటి ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దాని తీవ్రతనుబట్టి ఏ స్థాయిలో వర్షాలు కురుస్తాయో తర్వాత వెల్లడిస్తామని వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు తెలిపారు.  

20 శాతం అధిక వర్షపాతం నమోదు... 
రాష్ట్రవ్యాప్తంగా సరాసరి 20 శాతం అధిక వర్షపాతం నమోదైందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఏడాది జూన్‌ ఒకటో తేదీ నుంచి బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 54.11 సెంటీమీటర్ల మేర వర్షం కురవాల్సి ఉండగా 64.71 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సాధారణంకంటే 63 శాతం అధిక వర్షపాతం రికార్డు అయింది. అలాగే ఆదిలాబాద్‌ జిల్లాలో 59 శాతం, ఖమ్మం జిల్లాలో 58 శాతం, పెద్దపల్లి జిల్లాలో 50 శాతం, మహబూబాబాద్‌ జిల్లాలో 50 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 47 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయితే హైదరాబాద్, జోగులాంబ గద్వాల, మేడ్చల్‌ రంగారెడ్డి, మెదక్, నాగర్‌ కర్నూల్, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వరి నాట్లు పుంజుకున్నాయి.   

మరిన్ని వార్తలు