‘ఆనందం’ ఆవిరైంది

9 Feb, 2019 00:37 IST|Sakshi
సిరిసిల్ల బస్టాండ్‌ ఎదుట ఉన్న ఆనందంకు ఆర్థికసాయం చేస్తున్న చందు

సిరిసిల్లలో రోడ్డునపడ్డ నేత కుటుంబం 

అచేతన స్థితిలో నేతకార్మికుడు

చనిపోతాడని గెంటేసిన అద్దింటి యజమాని 

మరో ఇంటికి బయానా ఇచ్చినా..ఇంట్లోకి రానివ్వని వైనం

ఒక కాకి చనిపోతే.. వంద కాకులు చేరుతాయి.. అది జాతి ప్రీతి. అదే మనిషి చనిపోతే.. చేరదీయడం కాదు.. కనీసం ఇంట్లో కూడా ఉండనివ్వరు ఇది మా‘నవ’నీతి. ఇక్కడ ఓ నేత కార్మికుడు చనిపోలేదు.. పక్షవాతంతో మంచానపడి బాధపడుతున్నాడు. అతడు చనిపోతే.. అశుభంగా భావించి.. ఇంట్లోంచి వెళ్లగొట్టారు ఓ ఇంటి యజమాని. ఇంకో ఇంట్లోకి వెళ్లడానికి బయానా ఇచ్చినా.. విషయం తెలిసి వారు కూడా నిరాకరించారు. మలిసంధ్యలో కాపాడాల్సిన కొడుకు కూడా తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. దీంతో ఓ అద్దెబతుకు బస్టాండుపాలైంది. ఈ అమానవీయ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

సిరిసిల్లటౌన్‌: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం కట్టలింగంపేటకు చెందిన చెన్న ఆనందం బతుకు దెరువు కోసం పదిహేనేళ్ల క్రితం సిరిసిల్ల పట్టణానికి వచ్చాడు. ఇక్కడ సాంచాలు నడిపిస్తూ భార్య నిర్మల, కొడుకు రాజు, ఇద్దరు కూతుళ్లను సాకాడు. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి నిర్మల బీడీలు చుడుతూ భర్త సంపాదనకు తోడుగా నిలిచింది. రెండో కూతురు లతను భర్త గొడవపడి పుట్టింటికి పంపించగా.. తల్లిదండ్రుల వద్దే ఆరేళ్ల బాబు గణేష్‌తో ఉంటోంది. వీరికి సొంతిల్లు లేకపోవడంతో పదిహేనేళ్లుగా అక్కడా.. ఇక్కడా అద్దె ఇళ్లలో ఉంటూ కాలం నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం బీవైనగర్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రెండేళ్ల క్రితం ఆనందంకు పక్షవాతం వచ్చి కాళ్లు చచ్చుబడి మంచానికి పరిమితమయ్యాడు. దీంతో అతడు చనిపోతే.. ఇంటికి అరిష్టంగా భావించిన అద్దింటి యజమాని ఇంట్లోంచి వెళ్లిపోవాలని చెప్పాడు. రెండ్రోజుల క్రితం అదే ప్రాంతంలో మరో ఇంట్లో ఉండటానికి ఆనందం కుటుంబసభ్యులు బయానా ఇచ్చారు. గురువారం రాత్రి ఇంటి యజమాని బలవంతంగా ఖాళీ చేయించగా.. బయానా ఇచ్చిన కొత్తింటికి వెళ్లారు. వారికి అక్కడా పరాభవమే ఎదురైంది. ఆ ఇంటి యజమాని కూడా ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో దిక్కుమొక్కులేని స్థితిలో ఆ నేతన్న కుటుంబం అర్ధరాత్రి పూట కొత్త బస్టాండుకు చేరి చెట్టుకింద తలదాచుకుంది.  

చెప్పలేని ఆవేదన.. 
కష్టజీవులైన ఆ కుటుంబం బతుకు బస్టాండు పాలు కావడంతో చెప్పలేని ఆవేదనతో రగిలిపోయారు. ప్రయోజకుడైన కొడుకు కూడా మలిసంధ్యలో ఉన్న తల్లిదండ్రులను వదిలి అత్తింటివారితో ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచానికి పరిమితమైన ఆనందం, నిలువనీడ లేకుండా బస్టాండు వద్ద చెట్టుకింద ఉన్న విషయంపై స్థానికులు స్పందించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. తమ కష్టాలను మీడియా ముందు కన్నీరు పెట్టుకుంటూ చెప్పిన వైనం అందరినీ కంటతడి పెట్టించింది. అభాగ్య బతుకును ఆదుకోవాలని పోస్టింగులు చేయడంతో మానవతావాదులు స్పందించి విషయాన్ని స్థానిక తహసీల్దార్‌కు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించారు. విద్యాశాఖ అ«ధికారులతో మాట్లాడి ఎమ్మార్సీ భవనంలో ఉండటానికి ఆశ్రయం ఇవ్వాలని సూచించడంతో అధికారులు వారిని అక్కడకు తరలించారు. చంద్రంపేటకు చెందిన వీరబోయిన చందు బాధితులకు రూ.2వేలు ఆర్థిక సాయం చేశాడు. 

మరిన్ని వార్తలు