కరోనా ట్రాకర్‌!

31 Mar, 2020 04:04 IST|Sakshi

కరోనా బాధితుల ప్రాంతాలు తెలిపే వెబ్‌సైట్‌ 

మ్యాప్‌ ద్వారా చూపే ‘కరోనా ట్రాకర్‌’ 

రూపొందించిన గోవా ఇంజనీరింగ్‌ విద్యార్థులు 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి కోరలు చాచడంతో లాక్‌డౌన్‌ కారణంగా దేశమంతా ఇంటికే పరిమితమైంది. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఇదే సమయంలో ఏ నగరంలో ఎక్కడ ఎన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇలా తెలుసుకోవడం వల్ల ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే, మీ పరిసరాల్లో ఎంత మంది కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఉన్నాయో తెలుసుకునేందుకు గోవాకు చెందిన విద్యార్థులు కరోనా ట్రాకర్‌ (www.cosonatracker.in) వెబ్‌సైట్‌ను రూపొందించారు.

ఇది యాప్‌ రూపంలోనూ లభిస్తుంది. గోవాకు చెందిన 19 ఏళ్ల ఇంజనీరింగ్‌ విద్యార్థి శ్రీ కెనీ, అతని స్నేహితులు సలీల్‌ నాయక్, నికేత్‌ కామత్, రిషికేశ్‌ భండారీ, సాకేత్‌ మరాఠేతో కలసి కరోనా ట్రాకర్‌ను డిజైన్‌ చేశాడు. హప్‌కిన్స్‌ యూనివర్సిటీ మరికొన్ని నమ్మకమైన ఎన్జీవోలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ యాప్‌లో సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన.. ఆ ప్రాంతాలను మార్క్‌ చేసి చూపిస్తుంది.

మనదేశంలో ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మంది కోలుకున్నారు? మరణాలు, రికవరీ రేటు, డెత్‌ రేటు తదితరాలు పొందుపరిచారు. వయసులవారీగా ఎంతమందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందో కూడా గ్రాఫ్‌ల ద్వారా చూసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ యాప్‌ ఆధారంగా.. దేశంలో మొత్తం 1,199 మందికి పాజిటివ్‌ రాగా, అందులో 20–30 ఏళ్లవారు దాదాపు 130 మంది ఉన్నారు. 30–40 ఏళ్లవారు సుమారు 90 మంది ఉన్నారు. అలాగే రాష్ట్రాలవారీగా కేసుల వివరాలు చూసుకోవచ్చు. అంతేకాకుండా కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ వెబ్‌సైట్‌/యాప్‌ ద్వారా వివరించారు. అంతేకాదు, ఈ వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు కూడా పంపవచ్చు. ఆన్‌లైన్, యూపీఐ, క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా విరాళాలు అందించవచ్చు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా