పెళ్లి డీసీఎం నడిపింది మైనర్!

9 Apr, 2016 01:55 IST|Sakshi
పెళ్లి డీసీఎం నడిపింది మైనర్!

పరిగి: పెళ్లి డీసీఎం బోల్తా ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. ఇప్పటి వరకు పరిగి మండల పరిధిలోని సయ్యద్‌పల్లికి చెందిన డ్రైవర్ సైదప్పనే డీసీఎం నడిపాడని.. అతడే తొమ్మిది మంది మృతికి కారణమని అందరూ భావించారు. ఇప్పుడు పోలీసులు మరో వ్యక్తిని తెరపైకి తెచ్చారు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు పొట్టిగారి రాజు(16) సైదప్ప దగ్గర డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లి డీసీఎం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని పోలీసులు నిర్ధారించి అతడిని రాజేంద్రనగర్ సమీపంలోని సాతంరాయి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, పోలీసులు మాత్రం అరెసుట చూపలేదు. అయితే, సైదప్ప ఇంకా పరారీలోనే ఉన్నాడు. సైదప్ప పుణె లేదా ముంబై పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  
 
గేర్ వేయబోయి.. హ్యాండ్ బ్రేక్ వేయడంతో..
వికారాబాద్ మండలం ద్యాచారం గ్రామానికి చెందిన పెళ్లిబృందం గతనెల 30న వివాహం నిమిత్తం డీసీఎం వ్యాన్‌ను కిరాయికి తీసుకున్నారు. ఓనర్ నసిరొద్దీన్ డ్రైవర్ సైదప్పను పురమాయించి అతడికి వాహనం అప్పగించాడు. అయితే, సైదప్ప వెళ్లకుండా అతని స్థానంలో గత నెల రోజులుగా డీసీఎం నేర్చుకుంటున్న బాలుడు రాజుకు వాహనం అప్పగించాడు. అయితే, బాలుడు వాహనం ద్యాచారం నుంచి తీసుకొని పరిగి వరకు వస్తే.. అక్కడి నుంచి తాను డ్రైవ్ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

డ్రైవింగ్ పూర్తిగా తెలియని రాజు పెళ్లి బృందాన్ని ఎక్కించుకుని ఎలాగోలా పరిగి సమీపంలోకి వచ్చాడు. అయితే డ్రైవింగ్ సరిగా తెలియని రాజు గేర్ మార్చేక్రమంలో హ్యాండ్ బ్రేక్ వేయటంతో డీసీఎం అదుపుతప్పి బోల్తాపడినట్లు అతడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అయితే, ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందగా తర్వాత ముగ్గురు చనిపోయారు.

మరిన్ని వార్తలు