పెళ్లి సాయం పెరిగింది! 

20 Mar, 2018 09:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 ఇక నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ సాయం రూ.1,00,116

 ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఆనందం 

సాక్షి, కామారెడ్డి: ఆడపిల్లల పెళ్లిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా అందజేస్తున్న సాయాన్ని రూ.1,00,116 కు పెంచింది. సోమవారం శాసన సభలో సీఎం కేసీఆర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్‌ 2న కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. అప్పుడు కేవలం ఎస్సీ, ఎస్టీలకు వారికి రూ.51,116 అందజేసేవారు. తరువాత దీన్ని మైనారిటీలకు షాదీముబారక్‌ పేరుతో వర్తింపజేసి తరువాత అన్ని వర్గాల పేద కుటుంబాలకు వర్తింపజేయడంతో పాటు ఆర్థికసాయం మొత్తాన్ని రూ.రూ.75,116కు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా ఈ మొత్తాన్ని రూ.1,00,116 కు పెంచుతూ సీఎం ప్రకటన చేయడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా పరిధిలో 5 వేల మందికిపైగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా ప్రయోజనం పొందారు. బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 18 ఏళ్లు పైబడిన వారికి వివాహ కానుకగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా సాయం అందిస్తారు. అయితే పథకం అమలులో అక్కడక్కడా అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని లింగంపేట మండలంలో రెండు, మూడు అక్రమాలు జరగగా, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు