పెళ్లి సందడి

8 May, 2019 09:04 IST|Sakshi

ప్రారంభమైన పెళ్లిళ్ల సీజన్‌  

ఈ నెల మంచి ముహూర్తాలు  

15, 16, 29 తేదీల్లో ఎక్కువ వివాహాలు  

కన్వెన్షన్‌ సెంటర్లు, కల్యాణ మండపాలు బుకింగ్‌  

పురోహితులకు డిమాండ్‌  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పెళ్లి సందడికి సిద్ధమైంది. చైత్ర మాసం పూర్తయి, ఆదివారం నుంచి వైశాఖం ప్రారంభమైంది. ఈ నెల మంచి ముహూర్తాలు ఉండడంతో ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి. మరోవైపు వేసవి సెలవులు కూడా తోడవడంతో పెళ్లి సందడి ఓ రేంజ్‌లో ఉండనుంది. దుస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పెళ్లిళ్లకు అవసరమైన వస్తు సామగ్రిని కొనుగోలు చేసేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. దీంతో దుణాకాల్లో రద్దీ నెలకొంది. బుధవారం నుంచి శుభకార్యాలు ప్రారంభమవుతాయని పూజారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ నెల 15 ,16, 29 తేదీల్లో ఎక్కువ పెళ్లిళ్లు ఉన్నాయన్నారు. 

ముందే బుకింగ్‌..   
ఈ నెల మొత్తం మంచి ముహూర్తాలుఉండడంతో కల్యాణ మండపాలకు గిరాకీ ఏర్పడింది. పైగా ఈసారి ఎక్కువగా మధ్యాహ్నం మూహూర్తాలు ఉండడం, వేసవి కావడంతో ఏసీ కన్వెన్షన్‌ సెంటర్లు, మండపాలకు మరింత డిమాండ్‌ ఉంది. వీటి ధరలు కూడా రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు ఉండడంతో నగరవాసులు తమ స్థాయిని బట్టి ముందే బుక్‌ చేసుకుంటున్నారు. పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలు కూడా అధికంగా ఉండడంతో బస్తీల్లోని చిన్న ఫంక్షన్‌ హాళ్లకు కూడా డిమాండ్‌ ఏర్పడింది. గతంలో ఒక్క పురోహితుడు మాత్రమే పెళ్లి తంతు పూర్తి చేసేవారు. కానీ ఈ మధ్య ఎక్కువ పెళ్లిళ్లలో ఇద్దరు పురోహితులు కార్యక్రమాలు జరిపిస్తున్నారు. దీంతో పురోహితులకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ఇక సాధారణ శుభకార్యాలకు ముగ్గురు వాయిద్యకారులు ఉంటే సరిపోతారని, పెళ్లికి కనీసం ఐదుగురు కావాలని పేర్కొంటున్నారు. దీంతో వాయిద్యకారులకూ మంచి గిరాకీ ఉంది. వీరు ఒక్కో పెళ్లికి రూ.10వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటున్నారు.

దుకాణాలు కిటకిట.. 
ఓవైపు అక్షయ తృతీయ, మరోవైపు పెళ్లిళ్ల నేపథ్యంలో బంగారం ధర స్వల్పంగా తగ్గడం వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే విషయం. గ్రాముకు రూ.40 వరకు తగ్గిందని బంగారం వ్యాపారులు పేర్కొంటున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఎక్కువ మంది రెడిమేడ్‌ నగలపైనే ఆసక్తి చూపుతున్నారు. వధవు, వరుడుకి కావాల్సిన నగలను పూర్తిస్థాయి సెట్‌ల రూపంలో దుకాణదారులు అందిస్తుండడంతో వినియోగదారులు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. వీటితో పాటు వస్త్రదుకాణాలు కూడా రద్దీగా మారాయి. పండుగల సమయంలో ఇస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు ఇప్పుడు కూడా అందుబాటులోకి వచ్చాయి. 

మరిన్ని వార్తలు