ఇట్స్‌ లగ్గం టైమ్‌

6 Feb, 2019 09:36 IST|Sakshi

మాఘమాసం నేడే ప్రారంభం  

జూన్‌ వరకు మంచి ముహూర్తాలు  

ఈ నెలంతా పెళ్లిళ్లే...

బంజారాహిల్స్‌: నేటి నుంచి మాఘమాసం ప్రార ంభం కానుంది. మీనలగ్నం ప్రవేశంతో శుభకార్యాలకు వేళయింది. బుధవారం మొదలు జైష్టమాసం అంటే జూన్‌ నెలాఖరు వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.  గత డిసెంబర్‌ నెలాఖరున శూన్యమాసం ప్రవేశించడంతో ఇప్పటి వరకు శుభ ముహూర్తాలు లేవు. ఇక ఇప్పటి నుంచి వచ్చే జైష్టమాసం వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో సిటీజనులు శుభకార్యాలకు శ్రీకారం చుడుతున్నారు. మళ్లీ జూలై నుంచి ఆషాఢం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు నెలల్లోనే శుభకార్యాలు జరుపుకునేందుకు ముహూర్తాలు చూసు కుంటున్నారు. దీనికి తోడు ఈ నెలంతా పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలున్నాయి. ఈ నెల 6, 7, 9, 10, 13, 14, 15, 18, 20, 21, 22, 23, 24, 28 తేదీల్లో బలమైన ముహూర్తాలున్నాయని జూబ్లీ హిల్స్‌ పెద్దమ్మ ఆలయం ప్రధాన అర్చకుడు చంద్రమౌళిశర్మ తెలిపారు. ఈ నెల 9న నగరంలో 50వేల పెళ్లిళ్లు జరగనున్నట్లు పేర్కొన్నారు. దీంతో సిటీకి పెళ్లి కళ వచ్చేసింది. ఫంక్షన్‌హాళ్లు బుక్‌ అయిపోయాయి. పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు, కొత్త దుకాణాల  ప్రారంభోత్సవాలకూ సిటీజనులు సిద్ధమవుతున్నారు. 

ఫంక్షన్‌హాల్స్‌ ఫుల్‌...  
పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఈ నెలంతా కల్యాణ మండపాలు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రధాన ఫంక్షన్‌హాల్స్‌ ఇప్పటికే బుక్‌ అయిపోయాయి. దీంతో చాలా మంది తమ ఇళ్ల దగ్గరే లేదా కాలనీ, బస్తీల్లోని సామాజిక భవనాల్లో పెళ్లిళ్లు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. పాఠశాలలు, ఖాళీ స్థలాలపై ఆధారపడుతున్నారు. తన కూతురు పెళ్లికి ఫంక్షన్‌హాల్‌ కోసం చూడగా దొరక్కపోవడంతో ఇంటి దగ్గరే చేయడానికి సిద్ధమయ్యానని ఫిలింనగర్‌కు చెందిన రాజబాబు అనే ఉద్యోగి తెలిపారు. ఇంకొంత మంది ఆలయాల్లో పెళ్లిళ్లు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

పురోహితులూ కష్టమే...   
ఫిబ్రవరిలో పెళ్లిళ్లు, ఒడుగు, ఉపనయనాలు, గృహ ప్రవేశాలు ఉండడంతో పురోహితులు దొరకడం కష్టంగా మారింది. దీంతో వారికి ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. ఒక పురోహితుడు ఒకేరోజు రెండు, మూడు పెళ్లిళ్లు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక క్యాటరింగ్‌ ఏజెన్సీలకూ డిమాండ్‌ పెరిగింది. సన్నాయి మేళాలు, బాజా భజంత్రీలు, డీజేలకూ గిరాకీ ఉంది. పెళ్లి పందిరి, వంటసామగ్రి, విద్యుత్‌ దీపాలు, కల్యాణ మండపాల అలంకరణ తదితర కాంట్రాక్టర్లకు చేతినిండా పని దొరుకుతోంది.

మరిన్ని వార్తలు