ముహూర్తాలు వచ్చేశాయ్‌..

25 Jun, 2018 13:39 IST|Sakshi
తలంబ్రాలు పోసుకుంటున్న నవవధూవరులు(ఫైల్‌)

మోగుతున్న బాజా భజంత్రీలు

డిసెంబర్‌ వరకు పెళ్లి రోజులు

ఊపందుకున్న అనుబంధ వ్యాపారాలు

జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఈ నెల15తో అధిక జ్యేష్టమాసం ముగియడంతో ఇప్పటికే బ్యాండ్‌ బాజా మోగుతుండగా 27, 30 తేదీల్లో దివ్యమైన శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. జూ న్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్‌ చివరి వారం వరకు వేల సంఖ్యలో వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యక్రమాలను నిర్వహించేందుకు చాలా మంది సన్నద్ధమవుతున్నారు. జూన్‌16 నుంచి నవంబర్‌ మాసం మినహా డిసెం బర్‌ నెల చివరి వరకు 29 మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. జూలై 15 నుంచి  ఆషాఢం రానుండడంతో ఆగస్టు 15వ తేదీ వరకు ముహూర్తాలు ఉండవని స్పష్టం చేశారు.

శుభ ముహూర్తాలు..
శుభ గడియల కోసం ఎదురు చూసిన వారు ఆలస్యం చేయకుండా వివాహాది శుభకార్యాలకు సన్నద్ధమవుతున్నారు. 2018 జూన్‌లో ఇప్పటికే కొన్ని పెళ్లిళ్లు జరుగగా 27, 30, జూలై 1, 5, 6, 7, ఆగస్టు 15, 16, 17, 18, 19, 23, 24, 29, 30, 31, సెప్టెంబర్‌ 2, డిసెంబర్‌లో 12, 14, 21, 22, 27, 28, 29, 30 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నట్లు శ్రీ సంతోషిమాత ఆలయ ప్ర«ధాన అర్చకులు తెలిపారు. తిరిగి 2019 ఫిబ్రవరి 07 నుంచి మంచి ముహూర్తాలు మొదలు కానున్నట్లు వివరించారు.

భక్తి శ్రద్ధలతో..
ఆగస్టు 14 నుంచి  శ్రావన మాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలు.. ప్రజలు ఉపవాస దీక్షలతో పూజలు చేస్తారు. శ్రావణ మాసం పండుగలకు.. శుభ కార్యాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ మాసంలో మంచి ముహూర్తాలు కలిసి వస్తుండడంతో పెళ్లిళ్లు, శుభకార్యాల సందడి నెలకొంటుంది.

ఎగిరే కెమెరా...
రూ.2.50లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తూ.. జీవితంలో తీపి గుర్తులుగా మిగిలిపోయో ఫొటోగ్రఫీ, వీడియోలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి తోడు డ్రోన్‌ కెమెరాకు ఆదరణ పెరుగుతోంది. వివాహాల్లో డ్రోన్‌ హల్‌చల్‌ చేస్తుంది. గగనతలం నుంచి అత్యంత క్వాలిటీతో ఫొటోలు, వీడియోలు తీయడం డ్రోన్‌ కెమెరా విశిష్టత.  భాజా భజంత్రీలు, డిజైన్స్, డెకరేషన్, పూలదండలు, లైటింగ్, డీజే, వస్త్ర, బంగారు దుకాణాల్లో సందడి మొదలైయింది.  

శుభకార్యాలకు అనువు..
2018 జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్‌లో 29 శుభ ముహూర్తాలు ఉన్నాయి.  జాతకాలను బట్టి పండితులు పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలను నిర్వహించేందుకు తేదీని చెబుతారు.
–శ్రీనివాసశర్మ, అర్చకులు

ఆభరణాల ఎంపికలో కీలకం..
పెళ్లి కూతురు.. వరుడి ఆభరణాల ఎంపికలో చాలా జగ్రత్తలు తీసుకుంటున్నారు. వధువు అలంకరణలో ఆభరణాల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. వ్యాపారం మాత్రం జోరుగా సాగుతుంది.

మరిన్ని వార్తలు