వీకెండ్‌లో ఓల్డ్‌ సిటీ

13 May, 2019 07:01 IST|Sakshi
చార్మినార్‌ పరిసరాల్లో విద్యుత్‌ దీపాల వెలుగులో షాపింగ్‌ సందడి

వీకెండ్‌తో పాతబస్తీకి పోటెత్తిన ప్రజలు

జోరుగా హలీం, అరబ్‌ వంటకాల విక్రయాలు  

సాక్షి,   సిటీబ్యూరో:రంజాన్‌ మాసం ప్రారంభమైందంటే పాతబస్తీలో కొత్త సందడి మొదలవుంది. ఇక్కడి మార్కెట్లు కళకళలాడతాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో రంజాన్‌ సందడి ఒకటైతే పాతబస్తీలో మరోవిధంగా ఉంటుంది. విదేశాల్లో ఉండే వారు సైతం ఈ మాసంలో హైదరాబాద్‌కు వస్తారంటే ఇక్కడి రంజాన్‌ ప్రత్యేకత అర్థ«ం చేసుకోవచ్చు. ఒకవైపు మసీదుల్లో ఆధ్యాత్మిక సందడి.. మరోవైపు ప్రత్యేక వంటకాలతో హోటళ్లు ఆకర్షిస్తుంటే.. కొత్త ఫ్యాషన్‌ దుస్తులతో షాపులు నగర ప్రజలను ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుతం ఉపవాస దీక్షలు ప్రారంభం నుంచే పాతబస్తీ మార్కెట్లు షాపింగ్‌కు సిద్ధమయ్యాయి. నోరూరించే మొగలాయి, ఇరానీ, అరేబియన్‌ వంటకాలు.. అడుగు ముందుకేయనీయని హలీం ఘుమఘుమలు, విద్యద్దీపాలతో జిగేల్‌ జిగేల్‌మనిస్తున్న పండ్ల దుకాణాలు పాతబస్తీకి కొత్త శోభను తెచ్చాయి.  

వీకెండ్‌లో ఓల్డ్‌ సిటీ
గ్రేటర్‌ ప్రజలు సాధారణంగా వారాంతల్లో పాతబస్తీకి రావడం ఆనవాయితీ. ఇక రంజాన్‌ మాసంలో వచ్చే వీకెండ్‌ అయితే ఇక పండగే అని చెప్పాలి. శని, ఆదివారాలు సీటీ దారులన్నీ ఓల్డ్‌సిటీకే దారితీశాయి. శివారు ప్రాంతాల నుంచి కూడా రంజాన్‌ షాన్‌ చూసేందుకు ప్రజలు పాతబస్తీ బాట పట్టారు. చాలామంది కుటుంబ సమేతంగా రంజాన్‌ మార్కెట్‌లో షాపింగ్‌తో పాటు వివిధ రకాల వంటకాలను రుచి చూశారు. శనివారం వర్షంతో పాటు అదివారం ఎండ కాస్త చల్లబడడంతో నగర ప్రజలు పిక్‌నిక్‌ మూడ్‌తో పాతబస్తీలో గడిపారు. దీంతో ఇక్కడి మార్కెట్లు, హోటళ్లలో హలీం రుచులను ఆస్వాదించారు. జనం తాకిడితో ఓల్డ్‌ సిటీలో హలీం, ఇతర మాంసాహార పదార్థాల విక్రయాలు జోరుగా సాగాయి.

హలీం వ్యాపారం బాగుంది  
రంజాన్‌ మాసంలో అత్యధిక మంది నగరవాసులు అరబ్‌ వంటకాలు, హలీం తినేందుకు ఇక్కడకు వస్తుంటారు. మాములు రోజుల కంటే శని, అదివారాల్లో చాలామంది ప్రాంతాల ప్రజలు పాతబస్తీకి వచ్చి పలు వంటకాలను ఆస్వాదిస్తారు. ప్రత్యేకంగా హలీంను తినిడానికి కుటుంబ సమేతంగా వస్తారు. తక్కువ మసాలతో చేసే రుచికరమైన హలీంను అన్ని వయసుల వారు ఇష్టపడుతున్నారు.– ఉమర్‌ ఆదిల్, షాదాబ్‌ హోటల్‌ యజమాని (మదీనా సర్కిల్‌) 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు