వీక్లీ ఆఫ్ షురూ

22 Mar, 2015 17:31 IST|Sakshi

కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పోలీసులకు వీక్లీ ఆఫ్ అంశంపై కసరత్తు పూర్తయిందనీ, అతి త్వరలోనే పోలీసులకు వీక్లీఆఫ్‌లు ఇవ్వనున్నామని తెలంగాణ హోంమంత్రి ఆదివారం ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించడానికి వచ్చిన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈవిధంగా వెల్లడించారు. ఆదివారం కరీంనగర్లో పర్యటించిన హోంమంత్రి మహదేవ్‌పూర్, ముత్తారం మండల కేంద్రాల్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేస్తూ అధునాతన సౌకర్యాలతో హైదరాబాద్‌లో కమాండెంట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు పూర్తయ్యాయన్నారు.

 

ఆడపడుచులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, యువతులను ఏడిపించే ఆకతాయిలకు తగిన బుద్ధి చెప్తామని అన్నారు.
కాగా ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. అనంతరం హోంమంత్రి కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలను నిర్వహించడానికి తమ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తుందన్నారు. గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించి పనులను సమీక్షించారు.

మరిన్ని వార్తలు