వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు

23 Dec, 2016 01:07 IST|Sakshi
వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు

ధరించాలని ప్రజాప్రతినిధులకు కేటీఆర్‌ లేఖ
సాక్షి, హైదరాబాద్‌: చేనేత కార్మికులకు చేయూత నిచ్చేందుకు వారంలో ఒక రోజు తప్పనిసరిగా చేనేత వస్త్రా లు ధరించాలని రాష్ట్ర ప్రజాప్రతినిధులకు ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు గురువారం మంత్రి లేఖలు రాశారు. వారి కార్యాలయా ల్లోని అధికారులు, సిబ్బంది కూడా చేనేత దుస్తులే ధరించే లా చూడాలని కోరారు. టెస్కో సంస్థ అమలు చేస్తున్న ‘చేనేత లక్ష్మి పథకం’లో చేరి చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి, కార్మికులకు చేతినిండా పని కల్పించేందుకు సహకరించాలన్నారు. భారతీయ సాంప్రదాయ ఔన్నత్యాన్ని, చేనేతలోని హుందాతనాన్ని ప్రపంచానికి చాటుతున్న ఎందరో నేతన్నలు తెలంగాణ గడ్డపై ఉన్నారని తెలిపారు. పోచంపల్లి వస్త్రాల ప్రభావం, నారాయణపేట వస్త్రాల నాజూకుతనం, గద్వాల వస్త్రాల ఘనతను దేశవిదేశాలు కీర్తిస్తున్నాయన్నారు. ఒకప్పుడు చేనేత పరిశ్రమ ఉండేదని రాబోయే తరాలు చెప్పుకోవద్దంటే ఈ చిన్న ప్రయత్నాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ వస్తేనే తమ బతుకులు మారుతాయని ఆశగా ఎదురుచూసిన నేతన్నలకు మనవంతుగా మంచి చేసేందుకు ఈ నూతన సంవత్సరం ఒక అవకాశం కల్పించిందన్నారు.

మరిన్ని వార్తలు