ఎయిర్‌పోర్టులోనే ఎదుర్కోలు

9 Jun, 2015 01:33 IST|Sakshi
ఎయిర్‌పోర్టులోనే ఎదుర్కోలు

* పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్ స్వాగతం
* 12న ఐపాస్ మార్గదర్శకాల విడుదల కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు
* స్వాగత ఏర్పాట్లపై నేడు మంత్రి జూపల్లి సమీక్ష

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్) మార్గదర్శకాల విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ నెల 12న జరిగే కార్యక్రమానికి హాజరయ్యే పారిశ్రామిక దిగ్గజాలకు మర్యాదల్లో ఎక్కడా లోటు రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతను ఓ ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థకు అప్పగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిథులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు బయటి ద్వారం వద్ద కాకుండా నేరుగా విమానాశ్రయంలోనే ఎదురేగి స్వాగతం పలకాలని నిర్ణయించారు.

అతిథులకు స్థానికంగా బస ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై కేసీఆర్ పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆహ్వాన పత్రాల పంపిణీ పూర్తి కావడంతో అతిథులకు అసౌకర్యం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు.
 
ప్రముఖులకు ఆహ్వానాలు...
ఈ కార్యక్రమానికి వచ్చే 2 వేల మంది ప్రముఖులను కేటగిరీలుగా వర్గీకరించి ఆహ్వానాలు అందజేస్తున్నారు. సీఎంవోతోపాటు పరిశ్రమలశాఖ కార్యదర్శి ఆహ్వాన పత్రాల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు ముంబై వెళ్లి టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీని ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ మరో 130 మంది ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల ప్రముఖులకు స్వయంగా లేఖలు రాశారు.

ఆహ్వాన పత్రాలు అందుకున్న వారిలో చాలా మంది పారిశ్రామిక దిగ్గజాలు సుముఖత వ్యక్తం చేస్తూ లేఖలు పంపినట్లు పరిశ్రమలశాఖ వర్గాలు వెల్లడించాయి. పరిశ్రమలశాఖ కమిషనరేట్, టీఎస్ ఐఐసీ, టీఎస్ ఎండీసీ తదితర ప్రభుత్వశాఖల అధికారులు అతిథుల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు