తొలి సీఎంకు పూర్ణకుంభ స్వాగతం

3 Jun, 2014 02:37 IST|Sakshi
తొలి సీఎంకు పూర్ణకుంభ స్వాగతం

సచివాలయంలో డీ బ్లాక్ నుంచి ఎర్రతివాచీ
 
నల్ల పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు
సీ బ్లాక్ వద్ద ఉద్యోగులనుద్దేశించి ప్రసంగం
ఆ తర్వాత ముఖ్యమంత్రి చాంబర్‌లో
బాధ్యతల స్వీకరణ తెలంగాణ ప్రభుత్వ రాజముద్రికపై తొలి సంతకం

 
 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి సచివాలయానికి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అక్కడ పూర్ణకుంభ స్వాగతం లభించింది. మధ్యాహ్నం 12.13 గంటలకు సచివాలయంలోకి అడుగుపెట్టిన ఆయనకు వేదపండితులు మంత్రోచ్ఛారణలు, జయజయధ్వానాలతో అధికారులు, ఉద్యోగులు ‘డీ’ బ్లాక్ నుంచి ఎర్రతివాచీ పరచి ఘనస్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వ తొలి ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, తొలి డీజీపీ అనురాగ్‌శర్మ, ఇతర ఐఏఎస్ అధికారులు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు మమత, సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, ఎ.పద్మాచారి తదితర ఉద్యోగులు కేసీఆర్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.

మింట్‌కాంపౌండ్‌వైపు నుంచి తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి కొత్తగా నిర్మించిన ప్రధానద్వారం ద్వారా ఆయన లోపలికి ప్రవేశించారు. పరేడ్‌గ్రౌండ్స్ నుంచి ప్రత్యేకంగా బుల్లెట్‌లపై ఎర్రదుస్తుల్లో ఉన్న కాన్వాయ్ కేసీఆర్ వాహనానికి ముందు రాగా.. ఆయన సచివాలయానికి వచ్చారు. ‘డీ’ బ్లాక్ నుంచి నల్లపోచమ్మ గుడివరకు నడుస్తూ వచ్చిన ముఖ్యమంత్రి అమ్మవారిని పూజించారు. పూజ నిర్వహించిన అనంతరం ‘సీ’ బ్లాక్ ముందు ఏర్పాటు చేసిన సభాస్థలి వరకు రెడ్‌కార్పెట్‌పైనే ముఖ్యమంత్రి నడుస్తూ వచ్చారు. అక్కడ తెలంగాణ సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పలు ప్యాకేజీలు తమ మదిలో ఉన్నప్పటికీ, మనకు ప్రస్తుతం చట్టాలు, జీవోలు లేనందున వాటిని ప్రకటించడం లేదన్నారు. ఉద్యోగుల సర్వీ సు నిబంధనలు సరళీకృతం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నవ తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగులు మాట ఇచ్చినట్టు గంటపాటు అధికంగా పనిచేస్తే మరింత సంతోషిస్తానని ఆయన పేర్కొన్నారు.
 
రాజముద్రకు ఆమోదం: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణ రాష్ట్రప్రభుత్వ రాజముద్రను ఆమోదిస్తూ  కేసీఆర్ తొలిసంతకం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అందించిన ఫైలుపై పురోహితులు సూచించిన ముహూర్త సమయంలో మధ్యాహ్నం 12.57 గంటలకు ఆయన ఈ సంతకం చేశారు. ఆ తరువాత కేబినెట్ సహచరులతో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు.
 
 

మరిన్ని వార్తలు