ఇంటికి టెన్త్‌ విద్యార్థులు

22 Mar, 2020 01:47 IST|Sakshi

గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లోని విద్యార్థుల ఇంటిబాట

తల్లిదండ్రులు వస్తేనే పిల్లల్ని ఇంటికి పంపిస్తున్న అధికారులు

శానిటైజర్ల పంపిణీ... పలు సూచనలు జారీ

సాక్షి, హైదరాబాద్‌: పదోతరగతి పరీక్షలు వాయిదా పడటంతో సంక్షేమ శాఖల పరిధిలో వసతి పొందుతున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. కోవిడ్‌ వ్యాప్తిని నిలువరించే క్రమంలో ప్రభుత్వం పదోతరగతి పరీక్షలను వాయిదా వేసింది.మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే అంశం తేల్చకపోవడంతో అప్పటివరకు పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.దీంతో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వసతి పొందుతున్న విద్యార్థులను తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు. కేవలం సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులే కాకుండా గురుకుల పాఠశాలలు, ఆశ్రమ స్కూళ్ల విద్యార్థులు కూడా ఇదేవిధంగా వారి వారి ఇళ్లకు చేరుకుంటున్నారు.

జాగ్రత్తలు వహిస్తేనే మంచిది
కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు అవగాహన, జాగ్రత్త చర్యలే మేలని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ క్రమంలో ఇళ్లకు వెళ్తున్న టెన్త్‌ విద్యార్థులకు సంబంధిత అధికారులు పలు సలహాలు, సూచనలు చేశారు.ఇప్పటికే వారికి హ్యాండ్‌ వాష్‌లు, మాస్కులను పంపిణీ చేయగా... వాటిని వెంట తీసుకెళ్లాలని అధికారులు ఆదేశించారు. అదేవిధంగా ఇళ్ల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మిగిలిన పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే విషయాలను పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు వివరించారు.ఈమేరకు ప్రత్యేకంగా తయారు చేసిన సూచిక పత్రాలను వారికి ఇచ్చారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన వెంటనే పరీక్షలు జరిపే అవకాశం ఉండటంతో ఆమేరకు సిద్ధంగా ఉండాల్సిందిగా సూచించారు.

రిజిస్టర్‌లో విద్యార్థుల వివరాలు
పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల వివరాలను రికార్డు చేస్తున్నారు. గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల వారీగా ఉన్న విద్యార్థులను సంబంధి త అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిజిస్టర్‌లో నమో దు చేస్తున్నారు. ఇళ్లకు వెళ్లిన ప్రతి విద్యార్థి ఫోన్‌ నంబర్లు, పూ ర్తి చిరునామాను అందులో రికార్డు చేస్తున్నారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు తలెత్తితే వాటిని నివృత్తి చేసుకునేందుకు వీలుగా సంబంధిత పాఠశాల/హాస్టల్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ఫోన్‌ నంబర్‌ను విద్యార్థులకు ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు