సంక్షేమానికి పెద్దపీట

26 Jun, 2014 03:27 IST|Sakshi
సంక్షేమానికి పెద్దపీట

సాక్షి, కరీంనగర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన తొలి సమీక్ష కేవలం నాలుగు అంశాలతోనే ముగిసింది. వ్యవసాయం, విద్యుత్, తాగునీటి సరఫరా, రంజాన్, బోనాల పండుగల ఏర్పాట్లపై ఎక్కువ చర్చ జరిగింది. పింఛన్లు, ఇసుక అక్రమ రవాణాపై కొద్దిసేపు చర్చ జరిగింది. వర్షాకాలం.. వ్యాధులు ప్రబలే అవకాశాలున్నా వైద్యం, గ్రామాల్లో పారిశుధ్యం, విద్యపై ఎలాంటి సమస్యలు ప్రస్తావనకు రాలేదు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. శాఖల్లో కావాల్సిన సిబ్బంది, నిధులు కేటాయిస్తామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు అండగా ఉండాలని చెప్పిన మంత్రి.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని అధికారులను హెచ్చరించారు.
 
 టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి ఈటెల చెప్పారు. ఇరిగేషన్‌కు రెండో.. ఉపాధికి మూడో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. సాగునీరందించడంతోపాటు ఉపాధి కోసం గల్ఫ్ వలసలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేలా చర్యలు చేపట్టి.. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా కొత్త పాలసీ తీసుకొస్తామన్నారు. లారీల్లో ఇసుక అక్రమంగా రవాణా చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని, స్థానిక అవసరాల కోసం ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేసే వారికి కాస్త వెసులుబాటు ఇవ్వాలని అధికారులను కోరారు. వారం రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని, ఆలోగా పూర్తి స్థాయి నివేదికలతో హాజరుకావాలని ఆదేశించారు.
 
 సెంటిమెంట్ జిల్లా
 ‘కరీంనగర్ జిల్లా అంటే సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్. గతంలో చేపట్టిన ప్రతీ కార్యక్రమం ఈ జిల్లా నుంచే ప్రారంభించారు. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి భూమి లేని దళితులకు మూడెకరాల భూమిని పంపిణీచేసే కార్యక్రమాన్నీ ఈ జిల్లా నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు’ అని మంత్రి ఈటెల చెప్పారు. మండలానికి ఒక గ్రామం చొప్పున ఈ పథకం అమలు చేయనున్నట్లు వివరించారు. అందుకే ఈ జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష రూపాయలలోపు రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్నారు.
 
 రంజాన్, బోనాల పండుగకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యుత్ కోతలు.. నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. సమావేశంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్టమధు,  విద్యాసాగర్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, బొడిగెశోభ, సోమారపు సత్యనారాయణ, కొప్పుల ఈశ్వర్, జీవన్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రి కేటీఆర్, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సతీశ్‌కుమార్, రమేశ్‌బాబు హాజరుకాలేదు.
 
 నిధులు దుర్వినియోగం చేశారు
 మంథని నియోజకవర్గ పరిధిలోని ఎల్.మడుగులో వందలాది మొసళ్లు.. నీటి కుక్కలున్నాయి. అది ఎనిమల్ సాంచ్యూరీ. నిబంధనల ప్రకారం.. అక్కడి నుంచి ఎలాంటి వనరు ఉపయోగించే వీలులేదు. గత ప్రభుత్వ హయాంలో ఆ మడుగు నుంచి నీటి సరఫరా చేస్తామని చెప్పి అధికారులు టెండర్లు పిలిచారు. లక్షలాది రూపాయలతో సగం వరకు పైప్‌లైన్ కూడా వేసి మధ్యలో పనులు ఆపేశారు. తర్వాత అడిగితే అటవీ శాఖ అనుమతి లేదంటున్నారు.  ఇలాంటి పథకాల పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగమయ్యాయి.  నిధులు రికవరీ చేయాలి. మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి. వాటిని అరికట్టాలి.        
 - పుట్ట మధు, మంథని ఎమ్మెల్యే
 
 పింఛన్లు తొలగించారు
 బయోమెట్రిక్ విధానంతో పింఛన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారు. వేలిముద్రలు సరిగా లేవనే సాకుతో నియోజకవర్గంలో అర్హులైన వారి పింఛన్లు తొలిగించారు. వందలాది మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇవ్వాలి.
 - కె.విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే
 
 తాగునీటి సమస్య పరిష్కరించాలి
 నియోజకవర్గంలో పలు చోట్ల ఉన్న మంచినీటి పథకాలు పని చేయడం లేదు. గతంలో కోంపల్లిలో రోడ్డు వెడల్పు సమయంలో ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను కూల్చేసిన అధికారులు ఇంత వరకు ఇతర ప్రాంతంలో నిర్మించలేదు. శంకుస్థాపన జరిగి ప్రారంభం కాని విద్యుత్ సబ్‌స్టేషన్లను వెంటనే ప్రారంభించాలి.
 - దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే
 
 తహశీల్దార్లను మార్చండి
 నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఉన్న తహశీల్దార్లంతా మాజీ ఎమ్మెల్యే బంధువులే. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. సమస్యలు విన్నవిస్తే.. పరిష్కరిస్తలేరు. ఒకే వర్గానికి చెందిన వారందరినీ మార్చండి. నియోజకవర్గంలో విద్యుత్, నీటి సమస్య తీర్చండి.                - బొడిగె శోభ, చొప్పదండి ఎమ్మెల్యే
 
 పరిహారం ఏదీ?
 రైతుల తప్పిదమో.. విద్యుత్ అధికారుల తప్పిదమో తెలియదు కానీ, జిల్లాలో ఎంతో మంది కరెంట్ షాక్‌తో చనిపోయారు. వారికి పరిహారం అందించే విషయంలో స్థానిక ఏడీఈ, ఎస్‌ఈల రిపోర్టే కీలకం. మృతులకు మేలు చేకూరేలా రిపోర్టు పంపిస్తే.. వారికి పరిహారం అందుతుంది. ధర్మపురి ఓ పుణ్యక్షేత్రం. బ్రహ్మోత్సవాలు.. గోదారి పుణ్యస్థానాలకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అక్కడ స్టోరేజీ ట్యాంకును నిర్మించాల్సిన అవసరం ఉంది.
 - కొప్పుల ఈశ్వర్, ధర్మపురి ఎమ్మెల్యే
 
 బిల్లు చెల్లించినా నీరివ్వడం లేదు
 ఎలగందల్‌లో ఉన్న మంచినీటి పథకంతో కరీంనగర్ మండలంతోపాటు చొప్పదండి కి తాగునీరందుతుంది. రూ.6.5 ల క్షల విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నాయంటే.. అది నేనే చెల్లించా. రెండేళ్లవుతున్నా 50 ఆవాస ప్రాంతాలకు నీరందడం లేదు. మంచినీటి పథకాల పరిస్థితి ఇలా ఉంటే ప్రజలెలా బతుకుతారు?
 - గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే
 
 తాగునీటి పథకాలకు
 మోక్షమెప్పుడు..?
 జగిత్యాల నియోజకవర్గంలో తాగునీటి పథకాలు పడకేశాయి. రాయికల్, జగిత్యాల ప్రజలకు నీరందించే పథకానికి శంకుస్థాపన చేసి ఆరేళ్లు పూర్తయినా.. ఇంత వరకు పనులు పూర్తికాలేదు. 132 కేవీ విద్యుత్     సబ్‌స్టేషన్‌ది అదే పరిస్థితి. పంటకు నీరందక రైతులు ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు.
 - తాటిపర్తి జీవన్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే
 
 రైతు సమస్యలు పరిష్కరించాలి
 ప్రతీ సీజన్లో రైతులు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. అధికారుల ప్రణాళికలోపంతో పంట నష్టపోతున్నారు. కనీసం కొత్త ప్రభుత్వంలోనైనా రైతుల పరిస్థితులు మారాలి. విద్యుత్, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి.
 - సోమారపు సత్యనారాయణ, రామగుండం
 

మరిన్ని వార్తలు