అన్ని కులాలకు సంక్షేమ ఫలాలు

19 Aug, 2019 02:13 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న అసెంబ్లీ స్పీకర్‌ పోచారం. చిత్రంలో రమణాచారి

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

విదేశీ విద్యాపథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు ఆనందకరమైన జీవితాన్ని అందించడమే బంగారు తెలంగాణ లక్ష్యమని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాల లబ్ధి చేకూరుస్తోందన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం అబిడ్స్‌లో వివేకానంద విదేశీ విద్యాపథకం కింద ఎంపికైన విద్యార్థులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅథితిగా హాజరయ్యారు. విద్యార్థులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశాక, సభనుద్దేశించి ప్రసంగించారు. సరస్వతి ఉన్న దగ్గరే లక్ష్మి ఉంటుందని, సమా జంలో గౌరవం పొందే వ్యక్తులు విద్యావంతులు మాత్రమేనన్నారు.

బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఆలోచించిన ఏకైక సీఎం.. కేసీఆర్‌ మాత్రమేనని, తెలంగాణ గడ్డపై నివసించే ప్రతీ వ్యక్తి సంతోషంగా జీవిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. బ్రాహ్మణ, జర్నలిస్టు, న్యాయవాదుల సంక్షేమానికి నిధులిచ్చిన ప్రభుత్వం మనదేనన్నారు. స్వచ్ఛ భారత్‌పై దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో సర్వే జరిగితే అందులో 6 తెలంగాణ జిల్లాలు ముందున్నాయన్నారు. పంచాయతీ చట్టాన్ని అమల్లోకి తెచ్చామని, పలు చట్టాల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంద న్నారు. యాదాద్రి గుడిలో అద్భుతమైన కట్టడాలు జరుగుతున్నాయని, చరిత్రలో నిలిచి పోయే గుడి నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రభుత్వం పురోహితులకు ఆర్థిక సహాయం చేస్తుందని, అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద నిధులిస్తున్నామన్నారు.

అనంతరం బ్రాహ్మణ పరిషత్‌ చైర్మన్‌ రమణాచారి మాట్లాడుతూ వివేకానంద విద్యా పథకం కింద 54 మంది ఎంపికయ్యారని, వీరిలో అమెరికాకు 27 మంది, ఆస్ట్రేలియాకు 12, కెనడాకు 8, ఫ్రాన్స్‌కు ఒకరు, జర్మనీకి నలుగురు, యూకేకు ఇద్దరు వెళ్తున్నారన్నారు. వీరికి రూ.10.80 కోట్ల విలువైన మంజూరీ పత్రాలు ఇచ్చామన్నారు. బ్రాహ్మణ పరిషత్‌ ద్వారా అమలయ్యే కార్యక్రమాలకు ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, వివిధ పథకాల కింద దరఖాస్తుకు సెప్టెంబర్‌ 20 వరకు అవకాశం ఉందన్నారు.

విద్యాపథకం కింద లబ్ధిదారుకు రూ.20 లక్షల సాయం అందిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు తక్కువగా వచ్చిన జిల్లాల నుంచి మరిన్ని స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మీ కాంతరావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు