చేనేత అభ్యున్నతికి చేయూత

11 Aug, 2018 02:26 IST|Sakshi

పద్మశాలీ సంఘం నేతలతో భేటీలో సీఎం కేసీఆర్‌

రెండున్నర ఎకరాల్లో రూ.5 కోట్లతో పద్మశాలీ భవనం

బహుముఖ వ్యూహంతో ముందుకు..

ఏం కావాలో చెప్పండి.. నిధులిస్తాం..

పద్మశాలీ సంఘం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని సూచన

టీఆర్‌ఎస్‌ తరఫున రూ.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: నేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే పద్మశాలీల అభ్యున్నతికి బహుముఖ వ్యూహంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఇందుకోసం ప్రభుత్వం, పద్మశాలీ సంక్షేమ సంఘం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. చేనేత, నేత వృత్తిలో కొనసాగుతున్న వారికి అవసరమైన చేయూత, ప్రోత్సాహం అందించడంతోపాటు.. వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని అన్నారు.

మారుతున్న కాలా నికి అనుగుణంగా సామాజిక మార్పులు వస్తాయని, ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవిక దృక్పథంతో ముం దుకు పోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన చెప్పారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతిభవన్‌కు వచ్చిన పద్మశాలీ సంఘం నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు.  

హైదరాబాద్‌లో పద్మశాలీ భవనం
పద్మశాలీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని, ఈ నిధులను సద్వినియోగం చేసుకుని శాశ్వత పరిష్కారాలు చూపాలని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లో పద్మశాలీ భవనం నిర్మాణానికి రెండున్నర ఎకరాల స్థలం, రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. పద్మశాలీ సంఘం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, ఇందుకోసం మొదటి విరాళంగా టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పద్మశాలీ సంఘం ప్రముఖులు కూడా సంక్షేమ నిధికి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

జోలె పట్టి.. చందాలు పోగుచేసి..
‘‘చేనేత వృత్తికి గతంలో గొప్ప గౌరవం దక్కేది. ఈ వృత్తిపై ఆధారపడిన పద్మశాలీలకూ ఎంతో గౌరవం ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. 130 కోట్ల మంది భారతీయులకు సరిపడా వస్త్రాలను చేనేత కార్మికులు నేయలేరు. మరమగ్గాలు, మిల్లులు వచ్చాయి. వాటితో చేనేత కార్మికులు పోటీ పడటం అసాధ్యం. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వేరే పనులు చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు.

సమైక్య పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదు. సమస్యలను పరిష్కరించలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కరీంనగర్‌ ఎంపీగా ఉన్న నేను స్వయంగా పూనుకుని సిరిసిల్లలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ.50 లక్షల పార్టీ నిధులతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశా. పోచంపల్లిలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోతే.. టీఆర్‌ఎస్‌ పక్షాన జోలె పట్టుకుని చందాలు పోగు చేసి ఆదుకునే ప్రయత్నం చేశాం’’అని వివరించారు.

వస్త్రాలు కొని ఆదుకుంటున్నాం..
‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చేనేత కార్మికులకు కొంతమేరకైనా ఆదుకోవచ్చని ఆనాడే అనుకున్నాం. రాష్ట్రం వచ్చాక చేనేత, మరమగ్గాల కార్మికులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. చేనేత, నేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్‌ పండుగల సందర్భంగా పంచే చీరలను, ఇతర ప్రభుత్వ అవసరాలకు వస్త్రాలను సేకరించి, మార్కెటింగ్‌ సమస్య రాకుండా చేస్తున్నది.

వంద శాతం ప్రభుత్వ నిధులతో మరమగ్గాలను ఆధునీకరిస్తున్నాం. నూలు, రసాయలనాలపై 50 శాతం సబ్సిడీ అందిస్తున్నాం. ఈ చర్యల వల్ల కొంత ఉపశమనం దొరికింది. మరమగ్గాల కార్మికులకు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల ఆదాయం వస్తోంది.  ఇదే శాశ్వత పరిష్కారం కాదు. ఇంకా చేనేత వృత్తుల్లోనే కొనసాగుతున్న వారికి, మరమగ్గాలపై పనిచేస్తున్న వారికి కొంత మేరకు ఈ ప్రయత్నాల వల్ల మేలు కలిగింది’’అని కేసీఆర్‌ తెలిపారు.


లెక్కలు తీయాలి..
చేనేత వృత్తిని వదిలేసిన వారిని, వేరే ఉపాధి చూసుకునే వారిని గుర్తించి చేయూత అందించాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. పద్మశాలీ సంఘం ప్రముఖులు, పెద్దలు ఇందుకోసం క్రియాశీలంగా మారాలని కోరారు. ‘‘తమ కులంలో ఎవరు సంప్రదాయ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు? వారికోసం ఏం చేయాలి? అలాగే పోచంపల్లి, గద్వాల, నారాయణపేట ప్రాంతాల్లో కళాత్మక చేనేత వృత్తి కొనసాగుతోంది. అక్కడి వస్త్రాలకు మార్కెట్‌ ఉంది. అలాంటి వారికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి? వృత్తిని వదిలిపెట్టిన వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపాలి? వారికి ప్రభుత్వం ఏం చేయాలి? అనే విషయాలపై లెక్కలు తీయాలి. మీకేం కావాలో మీరే నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

ఆ నిధులను ఉపయోగించుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎలా కనుగొంటారనే దానిపై అధ్యయనం చేయాలి’’అని కోరారు. సీఎంతో భేటీ అయిన వారిలో తెలంగాణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గోశిక యాదగిరి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మ్యాడం బాబురావు, ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, కోశాధికారి అంకం వెంకటేశ్వర్లు, మహిళా ఆర్థిక సహకార సంఘం అధ్యక్షురాలు గుండు సుధారాణి, ఆప్కో మాజీ చైర్మన్‌ మండల శ్రీరాములు, వరంగల్‌ జెడ్పీ మాజీ చైర్మన్‌ సాంబారి సమ్మారావు, ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధి సామల ప్రదీప్, పద్మశాలీ సంఘం నాయకులు జల్ల మార్కండేయ, గుండు ప్రభాకర్, చాగల్ల నరేంద్రనాథ్‌ ఉన్నారు. మంత్రులు జగదీశ్‌ రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, వివేకానంద, అధికారులు వికాస్‌రాజ్, నీతూప్రసాద్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు