ఆశలు లాక్‌‘డౌన్‌’

8 Apr, 2020 01:24 IST|Sakshi

గోనె సంచుల తయారీకి ‘నో’చెప్పిన పశ్చిమబెంగాల్‌

ధాన్యం సేకరణకు 20కోట్ల సంచులు అవసరం

రేషన్‌డీలర్లు, మిల్లర్ల నుంచి పాత సంచుల స్వాధీనం

‘డీలర్ల’ సంచుల ధర రూ.16 నుంచి రూ.18కి పెంపు

సేకరణ ప్రక్రియను ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచులను సమకూర్చడంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం చేతులెత్తేసింది. జనపనారతో తయారుచేసే గోనె సంచుల మిల్లులను లాక్‌డౌన్‌ గడువుకు ముందే తిరిగి ఆరంభించడానికి నిరాకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మన రాష్ట్రానికి నిరాశ మిగిల్చింది. దీంతో అప్రమత్తమైన పౌరసరఫరాల శాఖ రాష్ట్రంలోని రేషన్‌డీలర్లు, రైస్‌మిల్లర్ల వద్ద ఉన్న పాత గోనె సంచులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, ఒక్క గోనె సంచి కూడా బయటకు వెళ్లకుండా యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని నిర్ణయించింది.

కేంద్ర, రాష్ట్రాల వినతులకు బెంగాల్‌ ‘నో’
జనపనార బస్తాల కొరతతో రైతుల ఉత్పత్తుల సేకరణ దెబ్బతింటోందని, కాబట్టి సంచులు సమకూర్చాలని తెలంగాణ, పంజాబ్‌తో పాటు కేంద్ర ఆహారసంస్థ (ఎఫ్‌సీఐ) కొన్నిరోజులుగా పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని మోదీతో పాటు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతోనూ మాట్లాడారు. కేంద్ర జౌళి శాఖ సైతం మిల్లులు పనిచేయడానికి అనుమతించాలని ఆ ప్రభుత్వాన్ని కోరింది. పశ్చిమబెంగాల్‌లో 60 జనపనార మిల్లులు ఉండగా, అక్కడి నుంచే దేశానికి అవసరమైన 80శాతం సంచుల ఉత్పత్తి జరుగుతోంది. ఈ మిల్లుల్లో 2 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణ సీజన్‌ మొదలైంది. ప్రస్తుత సీజన్‌లో ఎఫ్‌సీఐ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆహార ధాన్యాల నిల్వలను తరలించేందుకు భారీగా సంచులు అవసరం.

ముఖ్యంగా రాష్ట్రాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద బియ్యం, గోధుమలు, కందిపప్పు సరఫరా చేయాలంటే కనీసం 20లక్షల బేళ్లు (సుమారు 100 కోట్ల సంచులు) ఈ ఏడాది అక్టోబర్‌ వరకు అవసరమని, ఈ దృష్ట్యా తయారీని ఆరంభించాలని ఈనెల 3న పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ లేఖ రాసింది. ఇక తెలంగాణలో గతేడాది 47లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం సేకరణకు కొత్తగా 12కోట్ల సంచులు సమకూర్చుకుంది. ఈ ఏడాది కోటి టన్నుల మేర సేకరణ ఉండటంతో 20కోట్ల సంచులు అవసరమని గుర్తించింది. ఇప్పటికే ఒకసారి వినియోగించిన సంచులు కొంతమేర లభ్యతలో ఉన్నాయి. ఇవి 35 నుంచి 40లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు సరిపోతాయి. కొత్తగా కనీసం 7 కోట్ల సంచులు అవసరమని పౌరసరఫరాల శాఖ అంచనా వేయగా, వీటిని అందించేలా ఉత్పత్తిని ఆరంభించి సరఫరా చేయాలని ప్రభుత్వం బెంగాల్‌ను కోరింది. మిల్లులు తెరిచేందుకు అవసరమైన అనుమతులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇస్తే తప్ప తెరిపించలేమని ఆ రాష్ట్ర సీఎస్‌ రాజీవ్‌ సిన్హా ప్రకటించారు.

సంచుల సేకరణకు నిర్ణయం:
బెంగాల్‌ ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. దీనిపై మంగళవారం సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. సమస్యను అధిగమించేందుకు రైస్‌ మిల్లర్లు, డీలర్ల దగ్గర ఉన్న పాత సంచులను తక్షణమే ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని, పాత సంచుల సరఫరాదారుల నుంచి సేకరణ మొదలుపెట్టాలని ఆదేశించారు. వీటి స్టోరేజీ సమస్య రాకుండా సంచులను కొనుగోలు కేంద్రాలకు అందుబాటులో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేయాలన్నారు. ధాన్యం సేకరణకు రూ.25వేల కోట్లు సమకూర్చినందున రవాణా కాంట్రాక్టర్లు, సరఫరాదారులు, డీలర్లకు తక్షణమే చెల్లింపులు చేయాలన్నారు. డీలర్ల నుంచి తీసుకునే సంచులకు ఒక్కో సంచి ధర రూ.16 ఉండగా,దాన్ని రూ.18కి పెంచినట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ నెల రేషన్‌కు సంబంధించి ఒక్కో లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యం ఇవ్వడంతో డీలర్ల వద్ద దాదాపు 60లక్షల గోనె సంచులున్నాయని, వీటిని సేకరించాలని సూచించారు. సంచుల సేకరణ ప్రక్రియను అడిషనల్‌ కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా