విద్యార్థుల ఆత్మహత్యలపై  ఏం చేస్తున్నారు? 

23 Feb, 2018 00:54 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసు 

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు కళాశాలల్లో విపరీతమైన ఒత్తిడి వాతావరణం నేపథ్యంలో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటూ సుప్రీం కోర్టు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు నోటీసు జారీచేసింది. ఈ అంశంపై ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేవో నాలుగు వారాల్లో తెలపాలని నోటీసులో పేర్కొంది. కనీస మౌలిక వసతులు లేకుండా కళాశాలలు హాస్టళ్లను నిర్వహిస్తున్నాయని, తగినన్ని స్నాన గదులు, మరుగుదొడ్లు కూడా లేవని ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు.

ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు చదువు పేరుతో మానసిక క్షోభకు గురిచేయడం కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వారాంతపు పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రతిభను పరీక్షిస్తూ ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రత్యేక సెక్షన్లుగా విభజించడంతో తోటి విద్యార్థుల్లో ఆత్మన్యూనతాభావం పెరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిస్థితిని నివారించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని న్యాయవాది వివరించారు. 

మరిన్ని వార్తలు