హైదరాబాద్‌పై అణుదాడి జరిగితే..

31 Mar, 2018 02:29 IST|Sakshi
ఉత్తరకొరియా అణుబాంబు హస్వాంగ్‌-14ను హైదరాబాద్‌పై విసిరితే కలిగే నష్ట తీవ్రత (ఊహాజనితం చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఆయుధం అణుబాంబు. అణుబాంబు విస్ఫోటన చెందడం వల్ల జరిగే నష్ట తీవ్రత ఊహలకు అందదు. అలాంటి ఆయుధాల సామర్ధ్యాన్ని కొన్ని దేశాలు మరింత పెంచుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఔట్‌ రైడర్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్చంధ సంస్థ అణు ఆయుధాల తీవ్రతపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు నడుంబిగించింది. ఈ నేపథ్యంలోనే అణు ఆయుధాలపై పరిశోధన నిర్వహిస్తున్న ఓ నిపుణుడితో వాటి ప్రభావాన్ని లెక్కించింది.

అణుదాడి మన ప్రాంతంలో జరిగితే దాని శక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఓ శాంపిల్‌ టూల్‌ మ్యాప్‌ను అభివృద్ధి చేసింది. దాని ద్వారా వివిధ ప్రాంతాల్లో అణుదాడి కలుగజేసే నష్టాన్ని ఊహించవచ్చు. అమెరికాకు చెందిన 15కేటీ లిటిల్‌ బాయ్‌, 300కేటీ డబ్ల్యూ-87, ఉత్తరకొరియాకు చెందిన 150కేటీ హస్వాంగ్‌-14 లాంటి అణుబాంబులను హైదరాబాద్‌పై ప్రయోగిస్తే జరిగే నష్ట తీవ్రత ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం.

15కేటీ లిటిల్‌ బాయ్‌
1945 ఆగష్టు 6న రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా విసిరిన లిటిల్‌బాయ్‌ అణుబాంబును హైదరాబాద్‌పై ప్రయోగిస్తే 1,43,879 మంది ప్రాణాలు కోల్పోవచ్చు. 2, 86, 939 మంది గాయాలపాలు కావొచ్చు. లిటిల్‌ బాయ్‌ బాంబును ప్రయోగించిన చోటు నుంచి 0.07 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగసిపడతాయి. బాంబు దాడి నుంచి ఉద్భవించే రేడియేషన్‌ పరిధి 2.18 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దాడి వల్ల ఉత్పత్తి అయ్యే వేడి ప్రభావం 3.44 చదరపు కిలోమీటర్ల మేర ఉండొచ్చు.

300కేటీ డబ్ల్యూ-87
అమెరికానే అభివృద్ధి చేసిన 300కేటీ డబ్ల్యూ-87 అణుబాంబుతో హైదరాబాద్‌పై దాడి జరిగితే నష్ట తీవ్రత లిటిల్‌ బాయ్‌ వల్ల జరిగే దాని కన్నా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఈ దాడిలో ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. 13 లక్షలకు పైచిలుకు ప్రజలు గాయపడొచ్చు. 300కేటీ డబ్ల్యూ-87ను విస్ఫోటనం చెందిన ప్రదేశం నుంచి 0.73 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగసిపడతాయి. పేలుడు నుంచి ఏర్పడే రేడియేషన్‌ పరిధి 5.56 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. దాడి వల్ల ఉత్పత్తి అయ్యే వేడి ప్రభావం 48.54 చదరపు కిలోమీటర్ల మేర ఉండొచ్చు.

150కేటీ హస్వాంగ్‌-14
ఉత్తరకొరియా అభివృద్ధి చేసిన హస్వాంగ్‌-14 అణుబాంబును హైదరాబాద్‌పై ప్రయోగిస్తే ఆ దాడిలో ఎనిమిది లక్షల మందికి పైచిలుకు ప్రాణనష్టం వాటిల్లొచ్చు. 13 లక్షలకు పైచిలుకు ప్రజలు గాయపడొచ్చు. హస్వాంగ్‌-14 విస్ఫోటనం చెందిన ప్రదేశం నుంచి 0.42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ స్థాయిలో అగ్నిజ్వాలలు ఎగసిపడతాయి. పేలుడు నుంచి వచ్చే రేడియేషన్‌ పరిధి 4.56 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. వేడి ప్రభావం 26.42 చదరపు కిలోమీటర్ల మేర ఉండొచ్చు.

అణు దాడులకు సంబంధించిన ఊహాజనిత నష్టాలను అణు ఆయుధాలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త అలెక్స్‌ వెల్లర్‌స్టెయిన్‌ అభివృద్ధి చేసిన టూల్‌ ద్వారా అంచనా వేస్తున్నారు. ఔట్‌ రైడర్‌ ఫౌండేషన్‌ సైతం అణు ఆయుధాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏళ్లుగా కృషి చేస్తోంది. 2017లో ఐ-సీఏఎన్‌ అనే సంస్థ అణ్వస్త్ర నిరాయుధీకరణకు కృషి చేస్తున్నందుకు నోబెల్‌ శాంతి బహుమతిని అందుకుంది.

మరిన్ని వార్తలు