నయీమ్‌ కేసు ఏమైంది?

1 Aug, 2019 01:37 IST|Sakshi

ఆర్టీఐ ద్వారా వివరాలు కోరిన ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: నయీమ్‌ కేసుల వ్యవహారంపై ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌’ (ఎఫ్‌జీజీ) లేఖాస్త్రం సంధించింది. ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలతో గవర్నర్‌కు లేఖ రాసింది. కబ్జాలు, సెటిల్‌మెంట్లు, కిడ్నాప్‌లు, హత్యలతో రెండు దశాబ్దాలపాటు హైదరాబాద్‌ పరిసరాల్లో వ్యాపారులకు కంటి మీద కనుకు లేకుండా చేసిన నయీమ్‌ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

2016లో నయీమ్‌ను ఎన్‌కౌంటర్‌ అనంతరం సాగిన దర్యాప్తు, పురోగతి, ఎవరెవరిని అరెస్టు చేశారు? ఎవరిపై చర్యలు తీసుకున్నారో వివరాలు తెలపాలంటూ ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌’(ఎఫ్‌జీజీ) సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేసింది. సంస్థ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ఆర్టీఐ ద్వారా ఈ ప్రశ్నలను సంధించారు. కానీ, పోలీసుల నుంచి దర్యాప్తు జరుగుతోందన్న సమాధానం మాత్రమే వచ్చింది. దీంతో సదరు ఆర్టీఐ కాపీతోపాటు పలు సందేహాలతో కూడిన లేఖను బుధవారం ఇక్కడ విడుదల చేశారు. మూడేళ్లవుతున్నా నత్తలా నడుస్తున్న కేసు పక్కదారి పడుతోందంటూ గవర్నర్‌కి లేఖ ద్వారా ఫిర్యాదు కూడా చేశారు. 

మరిన్ని వార్తలు