ఆ రాత్రి హైదరాబాద్‌లో ఏం జరిగింది?

15 Aug, 2019 01:37 IST|Sakshi

1947, ఆగస్టు 14 అర్ధరాత్రి... హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో భాగంగా లేదు. దేశమంతటా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే హైదరాబాద్‌ నిజాం నిరంకుశ పాలనతో సతమతం అవుతోంది. అటు పాకిస్తాన్‌లోనూ, ఇటు భారత్‌లోనూ భాగం కాబోమనీ, హైదరాబాద్‌ స్వతంత్రంగానే కొనసాగుతుందని నిజాం రాజైన మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ప్రకటించుకున్నాడు. అంతకు ముందే ఎలాగైనా దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంకేతంగా ఆగస్టు 15న హైదరాబాద్‌లో జాతీయ జెండా ఎగురవేయాలని భావించిన నాటి కాంగ్రెస్‌ నాయకులు రామానంద తీర్థ తదితరులు ఢిల్లీ వెళ్లారు. స్వయంగా జవహర్‌ లాల్‌ నెహ్రూ జాతీయ జెండాని రామానంద తీర్థకి ఇచ్చారు.

హైదరాబాద్‌ తిరిగి వచ్చి ఆగస్టు 15న హైదరాబాద్‌లోని సుల్తాన్‌ బజార్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు రామానంద తీర్థ ఇతర కాంగ్రెస్‌ సభ్యులతో కలసి రహస్యంగా అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే అప్పటికే హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ అమలులో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ, ఆర్య సమాజ్‌ కార్యకర్తల రహస్య స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఆగస్టు 15 తెల్లవారు ఝామున 3 గంటలకు రామానంద తీర్థని అరెస్టు చేశారు. ఆ తరువాత జీ.ఎస్‌. మేల్కొటేని సైతం అదుపులోకి తీసుకున్నారు. కృష్ణమాచార్య జోషిని కూడా అరెస్టు చేశారు. ఇంకా హైదరాబాద్‌ అంతటా అరెస్టుల పర్వం కొనసాగింది. అరెస్టు చేసిన వారిని చెంచల్‌గూడ జైలులో ఉంచారు. అయితే అరెస్టయిన వారు జైలు గోడల మధ్యనుంచి సైతం నినాదాలతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆహ్వానించారు. 1947, ఆగస్టు 14న యావత్‌ భారతదేశం ఆ అమూల్యమైన ఘడియల కోసం ఎదురుచూస్తోంది. అర్ధరాత్రి 12 గంటలకు అన్ని రేడియోలూ ఢిల్లీలో జవహర్‌లాల్‌ నెహ్రూ ఉపన్యాసం కోసం వేచి చూస్తున్నాయి. నెహ్రూ, డాక్టర్‌ రాధాక్రిష్ణన్‌ నవభారత నిర్మాణం ఆవిష్కృతమవుతోందని ప్రకటించినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాము అంటూ రామానంద తీర్థ తన పుస్తకంలో రాసుకున్నారు. 

మరిన్ని వార్తలు