కత్తిపోట్లకు దారితీసిన వాట్సాప్‌ మెసేజ్‌

21 Oct, 2017 01:45 IST|Sakshi

బీటెక్‌ విద్యార్థుల మధ్య వివాదం

హైదరాబాద్‌: వాట్సాప్‌ గ్రూపులో మెసేజ్‌ ఓ యువకుడిపై కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన హైదరాబాద్‌ శివారు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. రోహిత్‌(20), భువనేశ్వర్‌(20) మైసమ్మగూడలోని నర్సింహా రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరు తమ స్నేహితులతో కలసి వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకున్నారు. ఇటీవల రోహిత్, భువనేశ్వర్‌ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. గురువారం రాత్రి భువనేశ్వర్‌ ‘శుక్రవారం రోహిత్‌ను నేను కొట్టబోతున్నాను’ అంటూ వాట్సాప్‌ గ్రూపులో మెసేజ్‌ పెట్టాడు. దీన్ని చదివిన రోహిత్‌ శుక్రవారం ఉదయం తన స్నేహితులతో కలసి నర్సింహారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ వద్ద మాటు వేసి, బస్సు దిగుతున్న భువనేశ్వర్‌పై కత్తితో దాడి చేశాడు.

ముఖం, చేతులు, నడుముకు గాయాలు కావడంతో అతడిని కళాశాల యాజమాన్యం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తోంది. దాడిని అడ్డుకునేందు కు ప్రయత్నించిన మరో విద్యార్థి కూడా గాయపడినట్లు సమాచారం. ఈ విషయాన్ని యాజమాన్యం దాచేందుకు ప్రయత్నించినా ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. రోహిత్‌తోపాటు అతని నలుగురు స్నేహితులు భువనేశ్వర్‌ను గట్టిగా పట్టుకుని కత్తితో దాడికి పాల్పడినట్లు క్షతగాత్రుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు