అసలేం జరిగింది

23 May, 2014 02:28 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై పోస్ట్‌మార్టం మొదలైంది. పరాజయం పాలైన జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు ఓటమికి దారితీసిన కారణాలు వెతుక్కుంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్ గురువారం ఢిల్లీకి వెళ్లారు. నేడో రేపో పార్టీ అధినేత్రి సోనియాను కలిసి ఓటమి కారణాలపై నివేదికను అందించనున్నారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఫలితాల అనంతరం హైదరాబాద్‌లో మకాం పెట్టారు.
 
 ఆయనతో పాటు మాజీ విప్ అరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్యేలు అల్గిరెడ్డి, సుద్దాల దేవయ్య, బొమ్మ వెంకటేశ్వర్లు, కొమిరెడ్డి రాములు, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, డీసీసీ మాజీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కేతిరి సుదర్శన్‌రెడ్డి, బాబర్‌సలీం పాషా జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
 
 వీరందరి ఓటమికి కారణాలను అధిష్ఠానానికి నివేదించాలని టీపీసీసీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా, ఘోర పరాజయం ఎదురుకావడంపై లోతుగా అధ్యయనం చేయడానికి జిల్లాల వారీగా సమీక్షలకు నడుం బిగించింది. ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్ని డీసీసీలకు ఆదేశాలు జారీ చేసింది. సమీక్ష అనంతరం సమగ్ర నివేదిక అందజేయాలని సూచించింది. అభ్యర్థులతో పాటు సీనియర్ నేతలు, పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులతో సమావేశమై ఓటమిని సమీక్షించుకోనుంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన కాంగ్రెస్ నేతలకు సైతం చేదు ఫలితం ఎదురవటంతో జిల్లాలో ఓటమి సమీక్ష ప్రాధాన్యాన్ని సంతరించుకోనుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరగని పోరాటం చేస్తూనే  అభివ ృద్ధి పనులు చేశాం... ఇంకేం తక్కువ చేశామని ప్రజలు తమను తిరస్కరించారని మాజీ ఎంపీలు పొన్నం, వివేక్ ఆవేదన చెందుతున్నారు.
 
 పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంతోనే ఢిల్లీ స్థాయిలో గుర్తింపు పొందారు. ఓ దశలో అధిష్ఠానాన్ని ధిక్కరించి, సొంత పార్టీ సీఎం కిరణ్‌ను వ్యతిరేకించి జైలుకు వెళ్లారు. సోనియా సమక్షంలో పార్టీ ప్లీనరీలో పొన్నం  తెలంగాణ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంట్‌లో జరిగిన పెప్పర్ స్ప్రే దాడిలోనూ తెగింపు ప్రదర్శించారు.
 
 ఉద్యమ సమయంలో స్వపక్ష నేతలతో పాటు విపక్ష నేతల నుంచి ఆయన ప్రశంసలు అందుకున్నారు. స్వయానా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా కాంగ్రెస్‌ను తిడుతూనే ప్రభాకర్‌ను పొగిడిన సందర్భాలున్నాయి. మరోవైపు అభివ ృద్ధి పనులు సాధించి తెచ్చిన పొన్నంకు ఈ ఎన్నికలు గట్టి షాక్ ఇవ్వటం పార్టీ శ్రేణులు సైతం ఊహించలేకపోతున్నాయి.
 
 పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ సైతం తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అభివ ృద్ధిలోనూ తన ముద్ర వేసుకున్నారు. కానీ... ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌లోకి, ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరటం... ఆయనకు చేదు ఫలితం తెచ్చిపెట్టిందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
 
 ప్రధానంగా ముందుగా వచ్చిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తమ కొంప ముంచాయని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు అంగీకరిస్తున్నారు. టిక్కెట్ల రేసులో భంగపడ్డ పార్టీ నేతలు, కార్యకర్తలు, గ్రూపు విభేదాలు, అంతర్గత వెన్నుపోట్లు తమకు చేటు తెచ్చాయని విశ్లేషించుకుంటున్నారు.
 
  అన్నింటికీ మించి టీఆర్‌ఎస్ ప్రభంజనంలోనే తాము ఓటమి పాలయ్యామని ఎమ్మెల్యే అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు టీఆర్‌ఎస్ మేనిఫెస్టోకు ప్రజాదరణ లభించిందని, ఆ స్థాయిలో కాంగ్రెస్‌కు మేనిఫెస్టో లేకపోవటం ప్రతికూలించిందని అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటమి సమీక్షలో ఏం తేలుతుందో.. వేచి చూడాల్సిందే.
 

మరిన్ని వార్తలు