పక్కా భవనాల నిర్మాణమెప్పుడో..?

5 Mar, 2019 09:37 IST|Sakshi
ఎస్టీ కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతున్న గంగారాంతండా పంచాయతీ కార్యాలయం

కొత్త గ్రామపంచాయతీల్లో మందకొడిగా పాలన

కొడిమ్యాల: 500 జనాభా ఉన్న గ్రామాలు, గిరిజన తండాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఇక తమ సమస్యలన్నీ స్థానికంగానే పరిష్కరించుకోవచ్చని నూతన గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు సంతోషించారు. ఐతే వారి ఆశలు నిజం కావడానికి మరింత సమయం పట్టేలా ఉంది.

నూతన పంచాయతీలు 21

కొడిమ్యాల మండలంలో హిమ్మత్‌రావుపేట, శనివారంపేట, దమ్మయ్యపేట, చింతలపల్లి, గంగారాంతండా, అప్పారావుపేట, కొండాపూర్, తుర్కకాశీనగర్‌ గ్రామాలు, గంగాధర మండలంలో చిన్న ఆకంపెల్లి, ఇస్లాంపూర్, మంగపేట, చెర్లపల్లి, లింగంపల్లి, నర్సింహులపల్లి, మధురానగర్, ముప్పిడిపల్లి, వెంకంపల్లి, మల్యాల మండలంలో గొర్రెగుండం, గుడిపేట గ్రామాలు, రామడుగు మండలంలో పందికుంటపల్లి, చొప్పదండి మండలంలో సాంబయ్యపల్లి గ్రామం కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి.

అద్దె భవనాల్లోనే పాలన

పాలనాధికారాల వికేంద్రీకరణతో అభివృద్ధి వేగవంతం కానుందని ఆనందపడ్డారు. ఐతే కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడంతో పరిపాలనా నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు గ్రామాల్లో కుల సంఘ భవనాలు, పాఠశాలల్లోని అదనపు గదులు, నిరుపయోగంగా ఉన్న పాత ప్రభుత్వ భవనాలను గ్రామ పంచాయతీ కార్యాలయాలుగా ఉపయోగించుకుంటున్నారు. అధిక గ్రామాల్లో అద్దె భవనాలనే పంచాయతీలకు పరిపాలనా భవనాలుగా ఉపయోగిస్తున్నారు. కొత్త జీపీల నిర్వహణకు నిధుల లేమి కారణంగా అద్దె భవనాలకు అద్దె కూడా చెల్లించలేని స్థితిలో గ్రామ పంచాయతీలున్నాయి.

కానరాని కారోబార్లు.. కార్మికులు

నూతన గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు కారోబార్లు, పారిశుధ్య కార్మికులు, వాటర్‌ పంప్‌మెన్లు, ఎలక్ట్రీషియన్లను నియమించలేదు. నిధులు లేకపోవడంతో తాత్కాలికంగా పని చేసేవారిని నియమించుకోలేకపోతున్నారు. దీంతో ఆయా పంచాయతీల్లోని ప్రజలు అరకొర వసతులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుధ్య కార్మికులు లేక గ్రామాల్లో చెత్త పేరుకుపోతోంది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు వారి డబ్బులతోనే పనులు చేపడుతున్నారు. నిధులు మంజూరయ్యే దాకా కొత్త పాలకవర్గాలు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.

కార్యదర్శుల నియామకంలో ఆలస్యం

పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష నిర్వహించి నెలలు గడుస్తున్నా.. ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో గ్రామాల్లో పాలన గాడి తప్పుతోంది. ప్రస్తుతమున్న కార్యదర్శులను నాలుగు నుంచి ఐదు గ్రామాలకు ఇన్‌చార్జీలుగా నియమించారు. దీంతో ఏ ఒక్క గ్రామానికి సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఏ ఒక్క గ్రామ పంచాయతీకి వారంలో రెండు రోజుల సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నారు. ప్రజలు వివిధ రకాల ధ్రువపత్రాలు పొందడంలో ఆలస్యమవుతోంది. పన్నుల వసూళ్ల లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కోర్టు సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయని, కార్యదర్శుల నియామకాలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు.

కలెక్టర్‌కు వినతి

నూతన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరుతూ కొడిమ్యాల మండలంలోని 21 గ్రామాల సర్పంచ్‌లు జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలకు నిధులు మంజూరయ్యేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌కు వారు విన్నవించారు.

జేబులో నుంచే..
ఇప్పటివరకు మా తండాకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. కొత్త గ్రామ పంచాయతీలకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. తండాలో పారిశుధ్యం, రోజూవారీ ఇతర పనుల నిర్వహణకు ప్రస్తుతానికి జేబులో నుంచే ఖర్చు చేస్తున్నా.
భూక్యా భోజ్యనాయక్, సర్పంచ్, గంగారాంతండా

నిధులు మంజూరు చేయాలి
కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. ముందుగా గ్రామ పంచాయతీ భవనాలకు నిధులందించాలి. తర్వాత ఇతర పనులపై దృష్టి సారించాలి. నిధులు లేక ఏ పని చేపట్టలేకపోతున్నాం.
గరిగంటి మల్లేశం, సర్పంచ్, అప్పారావుపేట  

మరిన్ని వార్తలు