'తహసీల్‌' భవన నిర్మాణమెప్పుడో..?

13 Nov, 2018 17:46 IST|Sakshi
సింగరేణి క్వార్టర్‌లో నిర్వహిస్తున్న తహసీల్‌ కార్యాలయం

     నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులు

     అవస్థలు పడుతున్న సిబ్బంది, ప్రజలు

రామగిరి మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం నూతన భవన నిర్మాణం చేపట్టేదెన్నడని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, చిన్న పంచాయతీలను ఏర్పా టు చేసింది. దీనిలో భాగంగానే నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో కొత్తగా రామగిరి మండలాన్ని ఏర్పాటు చేశారు.

ముత్తారం: రామగిరి మండలకేంద్రంలోని సెంటినరీకాలనీలో సింగరేణి సంస్థకు చెందిన క్వార్టర్లలో తాత్కాలికంగా తహసీల్దార్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. నూతనంగా క్వార్టర్లలో ఏర్పాటు చేసిన తహసీల్దార్‌ కార్యాలయాన్ని 2016 అక్టోబర్‌ 11న మంత్రి ఈటల రాజేందర్‌ చేతులమీదుగా ప్రారంభించారు. అయితే ఇరుగ్గా ఉన్న క్వార్టర్లలో తహసీల్దార్‌ కార్యాలయ నిర్వహణ అధికారులకు కత్తి మీద సాములా మారింది. 

దీంతో నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.70లక్షల నిధులను మంజూరు చేసింది. నూతన భవన నిర్మాణం కోసం సింగరేణి సంస్థ పోస్టాఫీస్‌ ఎదురుగా అంగడి మార్కెట్‌ సమీపంలో ఎకరం స్థలాన్ని కేటాయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 26న తహసీల్దార్‌ కార్యాలయం పేరిట లీజ్‌ రిజిస్ట్రేషన్‌ చేసింది. అయితే సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. దాదాపు నిధులు మంజూరై ఏడాది, స్థలం కేటాయించి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. 

పక్కా భవనం లేక..
నియోజకవర్గంలో విస్తీర్ణంలో, జనాభాలో రామగిరి మండలం రెండో స్థానంలో ఉంటుంది. ఇలాంటి మండలంలో తహసీల్దార్‌ కార్యాలయానికి పక్కా భవనం లేక ఇరుగ్గా ఉన్న సింగరేణి క్వార్టర్‌లో నిర్వహించడంతో.. ఇటు ప్రజలు, అటు రెవెన్యూ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు